కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ లో ఘోరం జరిగింది. లాలాగూడ ప్రాంతంలో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు తెలిపిన పూర్తి సమాచారం ప్రకారం, సాయిబాబా దేవాలయం సమీపంలో నివసిస్తున్న మౌలిక (19) అనే యువతి, తార్నాకాలోని రైల్వే డిగ్రీ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదే కాలేజీలో అంబాజీ అనే వ్యక్తి వాలీబాల్ కోచ్‌గా పనిచేస్తున్నాడు.
కొంతకాలంగా అంబాజీ మౌలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని, పలుమార్లు ఆమెను బాధపెట్టాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ వేధింపులను తట్టుకోలేక మౌలిక తీవ్ర మనోవేదనకు గురై చివరికి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు లాలాగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు అంబాజీ పరారీలో ఉన్నాడని, అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మౌలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విద్యాసంస్థల్లో ఇలాంటి వేధింపులను అరికట్టేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


