42 శాతం రిజర్వేషన్ల డ్రామా..
లిల్లీపుట్ ముఖ్యమంత్రికి పాలన తెలియదు..
ప్రజల్లో వ్యతిరేకత తట్టుకోలేక కొత్త డ్రామా..
22 నెలల్లో బీసీలకు ఏం చేశారు..?
బీసీలను ఆర్థికంగా నష్ట పరచడమే కాంగ్రెస్ ధ్యేయం..
గ్రామాలు వెనకబడి పోయాయి..
తాటికొండ రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్ రావు..
కాకతీయ, వరంగల్ బ్యూరో : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. శుక్రవారం హనుమకొండ లోనీ ఎర్రబెల్లి దయాకర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు తాటికొండ రాజయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంయుక్తంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. దున్నపోతు మీద నీళ్లు పడితే ఎలా ఉంటదో రేవంత్ రెడ్డి తీరు అలా ఉంది. పార్టీ పరంగా ఒక మాట, ప్రజల ముందు ఇంకో మాట. యావత్ దేశంలోనే జోకర్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు నిలిచిపోయింది. అని వ్యాఖ్యానించారు. అతను మరో మాటలో, డిల్లీ అధిష్ఠానం కూడా రేవంత్ రెడ్డిని పక్కన పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే యాభై సార్లు డిల్లీ వెళ్లినా కలవకుండా తిరిగి పంపించారట. ప్రజలు కూడా ఈ ప్రభుత్వంపై బగ్గుమంటూ మండిపోతున్నారు. 22 నెలల పాలనలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయారు, అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కన పెట్టి మరో ఇద్దరు రెడ్డి నేతలు సీఎం కుర్చీ కోసం సిద్ధంగా ఉన్నారు. వారు కూడా ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు. అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ 420 హామీల పార్టీ ఎలాగో.. ఈ 42 శాతం రిజర్వేషన్ల డ్రామా కూడా అలాగే..
కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీల పార్టీ ఎలాగో, ఈ 42 శాతం రిజర్వేషన్ల డ్రామా కూడా అలాగే అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. లిల్లీపుట్ ముఖ్యమంత్రికి పాలన, చట్టాలపై అవగాహన ఏమీ లేదు. దేశంలో ఏ సీఎం సాధించని ఘనత, విమానం ఎక్కి దిగడంలో మాత్రం తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సాధించారు. అని ఎద్దేవా చేశారు. కోర్టును గౌరవించకుండా పొద్దుగాల నామినేషన్లు తీసుకుని సాయంత్రానికి నవ్వుల పాలయ్యారు. హైకోర్టు గూబ గుయ్యిమనిపించింది. రాష్ట్రంలో మంత్రులు కూడా కుర్చీ కోల్పోతామనే భయంతో తిరగలేని పరిస్థితి ఏర్పడింది. అని అన్నారు.
ప్రజల్లో వ్యతిరేకత తట్టుకోలేక కొత్త డ్రామా..
ప్రజల్లో వ్యతిరేకతను తట్టుకోలేక ఈ ప్రభుత్వం కొత్త డ్రామా మొదలు పెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేకనే కోర్టు ఆపిందని చెప్పి బాధ్యత తప్పించుకుంటున్నారు. 55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీసీల గురించి ఎప్పుడైనా ఆలోచించిందా? ఇప్పుడు తూటూతూ మంత్రంగా జీఓ ఇచ్చి మభ్యపెడుతున్నారు. నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉంటే కేంద్రంతో రిజర్వేషన్ల కోసం పోరాడండి. మేమంతా మీతో వస్తాం. అని సవాలు విసిరారు.
22 నెలల్లో బీసీలకు ఏం చేశారు..?
బీసీ బంధు బంద్, చేప పిల్లల పంపిణీ బంద్, నాయి బ్రాహ్మణ, రజకుల విద్యుత్ బకాయిలు పెండింగ్, గొల్లకురుమల గొర్రెల పథకం నిలిచిపోయింది. బీసీల మీద ప్రేమ ఉందంటూ నాటకం ఆడుతున్నారు. అని ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. గవర్నర్ ఆమోదం లేకుండానే 42 శాతం బిల్లుతో ఎన్నికలకు వెళ్లడం తెలివి తక్కువ పని. ఇదే కారణంగా బీహార్‌లో ఎన్నికలు ఆగిపోయాయి, మహారాష్ట్రలో రద్దు అయ్యాయి. ఈ ప్రభుత్వానికి అంత అవగాహన లేదా? అని ప్రశ్నించారు.
బీసీలను ఆర్థికంగా నష్ట పరచడమే కాంగ్రెస్ ధ్యేయం..
ఈ చట్టం నిలబడదని ఈ ప్రభుత్వానికి తెలుసు. అయినా కూడా బీసీలను మభ్యపెట్టడానికే ఈ నాటకం. అభివృద్ధి చేయలేక ఆర్టీసీని అమ్మే కుట్ర చేస్తోంది. మహిళలకు ఉచిత బస్సు అంటూ అప్పులు చేసి, చార్జీలు పెంచి మగవారిపై భారం వేస్తున్నారు. అని ఆయన అన్నారు. ప్రజలు ఇప్పటికే ఈ ప్రభుత్వంపై కోపంగా ఉన్నారు. ఇంకా ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ప్రజల సహనం ఉరికించి కొడుతుంది. అని హెచ్చరించారు.
గ్రామాలు వెనకబడి పోయాయి..
గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలను వెనకబడి పోయేలా చేసింది. కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి నిధులు ఇచ్చి వాటిని బలపరిచారు. కానీ ఈ ప్రభుత్వం గ్రామాలను ఆధ్వాన్న స్థితికి నెట్టేసింది. అని విమర్శించారు. ముందుగా 42 శాతం రిజర్వేషన్ చట్టాన్ని తీసుకురండి. బీసీలకు మేమంతా అండగా ఉంటాం. అని తాటికొండ రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు.


