కాకతీయ, నేషనల్ డెస్క్: ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి గురువారం ఢిల్లీలో అడుగుపెట్టారు. 2021లో తాలిబన్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత, భారతదేశానికి వస్తున్న తొలి ఉన్నత స్థాయి తాలిబన్ నేత ఆయనే కావడం విశేషం. ఆరు రోజులపాటు కొనసాగే ఈ పర్యటనలో, ముత్తాకి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లతో సమావేశం కానున్నారు. ఈ పర్యటన భారతదేశ–ఆఫ్ఘనిస్తాన్ సంబంధాల పునరుద్ధరణకు కీలకంగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఐరాస ఆంక్షల ఎత్తివేత తర్వాత పర్యటన:
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ముత్తాకిపై ఉన్న ప్రయాణ నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేయడం, ఈ పర్యటనకు మార్గం సుగమం చేసింది. రష్యాలో సమావేశాల తర్వాత ఆయన ఢిల్లీకి రావడం, ఆఫ్ఘనిస్తాన్ తన ప్రాంతీయ సంబంధాలను తిరిగి బలోపేతం చేసుకోవాలనే సంకేతాన్ని ఇస్తోంది. ఈ పరిణామాన్ని పాకిస్తాన్ జాగ్రత్తగా గమనిస్తోంది. ఎందుకంటే ఇది తన వ్యూహాత్మక, భద్రతా సమీకరణాలకు ముప్పు తెచ్చే అవకాశం ఉందని భావిస్తోంది.
భారత్–ఆఫ్ఘన్ సంబంధాల చరిత్ర:
భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ మధ్య చారిత్రాత్మకంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తాలిబన్ కాకుండా ఇతర ప్రభుత్వాల కాలంలో సంబంధాలు స్నేహపూర్వకంగా కొనసాగాయి. 2001 తర్వాత భారతదేశం ఆఫ్ఘనిస్తాన్‌లో మౌలిక వసతులు, విద్య, ఆరోగ్య రంగాల్లో 3 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. అయితే 2021లో తాలిబన్ మళ్లీ అధికారంలోకి రావడంతో, భారతదేశం తన రాయబార కార్యాలయాన్ని మూసివేయాల్సి వచ్చింది. అనంతరం మానవతా సహాయాన్ని సమన్వయం చేసేందుకు ఢిల్లీలో ఒక సాంకేతిక మిషన్‌ను ప్రారంభించడం ద్వారా సంబంధాలు మళ్లీ పునరుద్ధరించారు.
పాకిస్తాన్ ఆందోళన:
అయితే భారత్, అఫ్ఘాన్ దగ్గరవడం .. పాకిస్తాన్‌కు ఈ పరిణామం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాబూల్-ఢిల్లీ సంబంధాలు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA), తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) లకు బలం చేకూరుస్తాయని ఇస్లామాబాద్ భయపడుతోంది. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం, శరణార్థుల సమస్యల నడుమ ఆఫ్ఘన్ ప్రభుత్వం భారతదేశం వైపు మొగ్గు చూపడం, దౌత్యరంగంలో దానికి వెనుకడుగు వేయించినట్టే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
బాగ్రామ్ వైమానిక స్థావరంపై కొత్త చర్చ:
అమెరికా తిరిగి ఆఫ్ఘనిస్తాన్‌లోని బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని వినియోగించాలనే ప్రయత్నం కూడా దక్షిణాసియాలో కొత్త భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు దారితీస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ స్థావరం మళ్లీ చురుకుగా మారితే, చైనా, భారతదేశం, పాకిస్తాన్ మధ్య వ్యూహాత్మక పోటీ మరింత తీవ్రం కావచ్చు.
మొత్తానికి, అమీర్ ఖాన్ ముత్తాకి ఢిల్లీ పర్యటన కేవలం ఒక దౌత్యపరమైన సంభాషణ మాత్రమే కాదు.. ఇది ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతీయ స్థితి, భారతదేశం-పాకిస్తాన్ మధ్య వ్యూహాత్మక సమతుల్యతపై ప్రభావం చూపే పరిణామంగా పరిగణిస్తున్నారు.


