కాకతీయ, నేషనల్ డెస్క్: వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ ఎన్నికల కమిషన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం కోల్‌కతాలోని సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె, ఎన్నికల కమిషన్ అధికారులు తమ ప్రభుత్వ అధికారులను బెదిరిస్తున్నారని, ఇంకా ఎన్నికల తేదీలు ప్రకటించక ముందే రాజకీయ ఒత్తిడితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
మమతా మాట్లాడుతూ..ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులను పిలిపించి బెదిరిస్తోంది. ఇది రాజ్యాంగబద్ధ వ్యవస్థకు విరుద్ధం. ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించలేదు. కానీ వారు ఇప్పటికే అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. దీన్ని మేము సహించం అని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ఆమె బీజేపీపై కూడా ఘాటైన విమర్శలు చేశారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో బీజేపీ నిప్పుతో ఆడుకుంటోంది. ప్రజాస్వామ్యాన్ని తారుమారు చేయడానికి చేసే ప్రయత్నం ఏదైనా, అది దేశానికి ద్రోహమే అవుతుంది అని ఆమె హెచ్చరించారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణపై ఆమె తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. ఈ SIR ప్రక్రియ అసలు కనిపించడం లేదు. ఇది పశ్చిమ బెంగాల్‌లో NRC లాంటి వ్యవస్థను అమలు చేయడానికి ఒక ముసుగుగా ఉపయోగిస్తున్నారు అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.
మమతా వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ముందు అధికార యంత్రాంగంపై ఒత్తిడి, రాజకీయ జోక్యం, ఓటర్ల జాబితాల సవరణ వంటి అంశాలపై రాష్ట్ర రాజకీయ వాతావరణం మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.


