మల్లంపల్లి జడ్పిటిసి బరిలో కుసుమ రమాదేవి
జగదీష్ సతీమణికి బిఆర్ఎస్ అవకాశం
జగదీష్ సతీమణికి తోడుగా నిలబడనున్న మల్లంపల్లి
కాంగ్రెస్, బీజేపీ మద్దతు ఇస్తాయా….?
మండలంలో జోరుగా చర్చ…
కాకతీయ, ములుగు ప్రతినిధి: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో ములుగు జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటు అయిన జెడి మల్లంపల్లి మండలం జడ్పిటిసి స్థానం బీసీ మహిళ రిజర్వేషన్ కింద ఉండటంతో ప్రధాన పార్టీలలో అభ్యర్థుల ఎంపికపై చర్చలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి దివంగత ములుగు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుసుమ జగదీష్ సతీమణి కుసుమ రమాదేవిను జడ్పిటిసి అభ్యర్థిగా రంగంలోకి దింపే యోచనలో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మల్లంపల్లి మండలానికి జగదీష్ పేరు…..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జిల్లాల పునర్విభజన సమయంలో ములుగును ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని, అలాగే మల్లంపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా గుర్తించాలని ఆ ప్రాంత ప్రజలు ఐదేళ్ల పాటు సాగించిన ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యత పొందింది. అప్పటి ములుగు జడ్పీ చైర్మన్‌గా ఉన్న కుసుమ జగదీష్ ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మల్లంపల్లి ప్రజల ఆకాంక్షలను అనేకసార్లు బిఆర్ఎస్ అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లి, మండల హోదా సాధనలో ముఖ్య పాత్ర పోషించారు. దురదృష్టవశాత్తు 2023 జూన్ 11న జగదీష్ గుండెపోటుతో మరణించగా, ఆయన కల 2024 నవంబర్ 28న నెరవేరింది. మల్లంపల్లిని మండలంగా ప్రకటించడమే కాకుండా, ఆయన సేవలను గుర్తిస్తూ ఆ మండలానికి “జెడి మల్లంపల్లి” అని నామకరణం చేయడం జరిగింది.
జగదీష్ సతీమణికి మద్దతుగా ప్రజలు……
జెడి మల్లంపల్లి మండలానికి జడ్పిటిసి అభ్యర్థిగా జగదీష్ సతీమణి కుసుమ రమాదేవి పేరును బిఆర్ఎస్ పరిగణనలోకి తీసుకోవడంతో మండలవ్యాప్తంగా చర్చ మొదలైంది. జగదీష్ చేసిన సేవలకు కృతజ్ఞతగా మల్లంపల్లి ప్రజలు రమాదేవి వెంటే నిలబడతారని స్థానికులు చెబుతున్నారు. మల్లంపల్లి ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, వివిధ వర్గాలు రమాదేవికి మద్దతుగా ఉంటారని మండలంలో చర్చ జరుగుతుంది. జగదీష్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన సతీమణి గెలవాలి అన్న భావన మండలంలో స్పష్టంగా వినిపిస్తోంది.
కాంగ్రెస్, బీజేపీ మద్దతుపై చర్చ…..
ఇక కాంగ్రెస్, బీజేపీ వంటి ప్రధాన పార్టీలు ఏ వైఖరి అవలంబిస్తాయన్నదే ఇప్పుడు మల్లంపల్లి రాజకీయాల్లో ప్రధాన చర్చా అంశంగా మారింది. రమాదేవి అభ్యర్థిత్వాన్ని గౌరవప్రదంగా భావించి మద్దతు ఇస్తాయా? లేక తమ పార్టీ అభ్యర్థులను రంగంలోకి దింపుతాయా? అన్న ప్రశ్నలపై మండల వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. జెడి మల్లంపల్లి మండలంలో రాబోయే జడ్పిటిసి ఎన్నిక రసవత్తరంగా మారడం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



