కాకతీయ, బిజినెస్ డెస్క్: ఫోర్బ్స్ విడుదల చేసిన 2025 భారత బిలియనీర్ల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మరోసారి దేశంలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. అయితే, ఆయన నికర ఆస్తులు గత సంవత్సరం కంటే స్వల్పంగా తగ్గాయి. ఈసారి అంబానీ సంపద 12 శాతం తగ్గి 105 బిలియన్ అమెరికన్ డాలర్ల వద్ద స్థిరపడింది. ఇది సుమారు 14.5 బిలియన్ డాలర్ల నష్ట పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఫోర్బ్స్ ప్రకారం, భారత బిలియనీర్ల మొత్తం సంపద కూడా ఈ ఏడాది కొంత తగ్గింది. రూపాయి విలువ పడిపోవడం, సెన్సెక్స్‌లో 3 శాతం వరకు క్షీణత రావడం వల్ల భారతదేశంలోని 100 మంది అగ్రశ్రేణి కోటీశ్వరుల కలిపి సంపద 9 శాతం తగ్గి సుమారు 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ జాబితా ఫోర్బ్స్ అధికారిక వెబ్‌సైట్‌లైన forbes.com/india మరియు forbesindia.com లో అందుబాటులో ఉంది. అదనంగా, ఫోర్బ్స్ ఆసియా అక్టోబర్ ఎడిషన్‌లో కూడా ఈ ర్యాంకింగ్ ప్రచురించింది.
రెండవ స్థానంలో గౌతమ్ అదానీ:
మౌలిక వసతుల రంగ దిగ్గజం, అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ ఈ జాబితాలో రెండవ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆయన సంపద ప్రస్తుతం 92 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. గత ఏడాది హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వెలుగులోకి వచ్చిన తర్వాత అదానీ గ్రూప్ షేర్లు భారీగా క్షీణించిన విషయం తెలిసిందే.అయితే, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) 2025 సెప్టెంబర్‌లో ఇచ్చిన నివేదికలో హిండెన్‌బర్గ్ చేసిన మోసపూరిత లావాదేవీల ఆరోపణలను నిర్ధారించే ఆధారాలు లేవని తెలిపింది. దీంతో అదానీ గ్రూప్ షేర్లు మళ్లీ స్థిరపడటంతో ఆయన సంపద కూడా కొంత మేరకు పునరుద్ధరించింది.
ఫోర్బ్స్ జాబితా ప్రకారం, భారత బిలియనీర్లలో టెక్, ఎనర్జీ, ఫార్మా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు ప్రధానంగా ఉన్నారు. అయితే ఈ సంవత్సరం మార్కెట్ పరిస్థితులు, గ్లోబల్ ఆర్థిక ఒత్తిడుల కారణంగా చాలా మంది బిలియనీర్ల నికర ఆస్తులు తగ్గినట్లు ఫోర్బ్స్ విశ్లేషణ చెబుతోంది.


