కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్: భారత క్రికెట్ బోర్డుకు చెందిన జట్టును టీమిండియా అని ప్రసార భారత సంభోదించం సరైంది కాదంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. ఆ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఇదంతా మీకు, మాకు సమయం వేస్ట్ అని పిటిషనర్ తో ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావుతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు పిటిషన్ను తిరస్కరించింది.
బీసీసీఐ ప్రైవేట్ సంస్థ అని..భారత ప్రభుత్వంతో దానికి సంబంధం లేదని న్యాయవాది రీపక్ కన్సాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. భారత జాతీయ క్రికెట్ జట్టు అని బీసీసీఐ సంబోధించడం వల్ల తప్పుడు ప్రభావం పడుతుందని అందులో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రసార భారతి, ఆల్ ఇండియా రేడియో వంటి వాటిల్లోనూ బీసీసీఐ టీమ్ ను భారత జట్టుగా పిలవడం సరైంది కాదని పిటిషనర్ వెల్లడించారు. దీని వల్ల ప్రైవేటు సంస్థకు ఆర్థికపరమైన లబ్ది చేకూరుతోందని పిటిషన్ లో తెలిపారు. అయితే ఈ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణ సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా క్రీడలకు సంబంధించి పద్ధతి ఏవిధంగా ఉందో మీకు తెలుసా. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ రూల్స్ పై మీకు అవగాహన ఉందా. ఆ కమిటీలపై కేంద్రం లేదా రాష్ట్రాల జోక్యం ఉండకూడదన్నేది వారి పాలసీ. కానీ మీరు మాత్రం ప్రభుత్వ అధికారులు ఎంపిక చేసిన జట్టే భారత్ తరపున ప్రాతినిధ్యం వహించాలని అంటున్నారు. అయితే ఒలింపిక్ కమిటీ పాలసీపై మీకు అవగాహన ఉందా. గతంలో ఎప్పుడైనా క్రీడా సమాఖ్యల్లో ప్రభుత్వం కలుగజేసుకున్న సందర్భాలు ఉన్నాయా అని హైకోర్టు ఘాటుగా ప్రశ్నించింది.


