ఎంపిటిసి అభ్యర్థిగా గంపల శివకుమార్
గంపల శివ వైపే ప్రజా సంఘాల మద్దతు
రసవత్తంగా ఏటూర్ నాగారం ఎంపిటిసి ఎన్నికలు.
కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో జరిగే ఎంపిటిసి ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. ఎంపీపీ స్థానం ఎస్సీ జనరల్‌గా రిజర్వ్ కావడంతో, చల్పాక, ఏటూరు నాగారం (1-ఎస్‌సీ), కొండాయి (ఎస్‌సీ జనరల్) ఎంపిటిసి స్థానాల్లో గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో విద్యావంతుడు, యువ నాయకుడు గంపల శివకుమార్ వైపు ప్రజలతో పాటు వివిధ ప్రజా సంఘాలు, కార్మిక, కర్షక, దళిత, ఆదివాసి, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున మొగ్గు చూపుతున్నాయి. ఏటూరు నాగారం ప్రాంతానికి చెందిన సీనియర్ పాత్రికేయుడిగా, విద్యార్థి సంఘ నాయకుడిగా, యువజన సంఘ నాయకుడిగా, జర్నలిస్ట్ యూనియన్ నాయకుడిగా, అలాగే కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతగా గంపల శివకుమార్‌కు అన్ని వర్గాల్లో విశేష పరిచయం ఉంది.
మాల సామాజిక వర్గానికి చెందిన ఆయనకు ఎస్సీ వర్గాల్లో మంచి పట్టు ఉండగా, మండలంలోని అన్ని వర్గాలు ఆయనను మనవాడు గా భావిస్తున్నాయి. ఎంపిటిసి అభ్యర్థిగా గంపల శివ బరిలో నిలవడంతో ప్రజల్లో ఉత్సాహం నెలకొంది. స్థానిక సమస్యలు, ప్రజా అవసరాలు బాగా తెలిసిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఏటూరు నాగారం అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లే సామర్థ్యం గంపల శివకుమార్‌లో ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయన పేరును అధికారికంగా ప్రకటించినట్లయితే ఆ పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని స్థానిక ప్రజలు, సంఘాల నాయకులు అంటున్నారు. ఏటూరు నాగారం మండలంలో త్రాగునీరు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాళ్లు, రహదారులు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించిందని, ఈ అభివృద్ధిని మరింత వేగవంతం చేయగల నాయకుడు గంపల శివకుమార్ అని అభిప్రాయపడుతున్నారు.


