సెలవులకు వచ్చిన సిఆర్పిఎఫ్ జవాను ఉరేసుకుని ఆత్మహత్య
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి సమీపంలోని కాట్రపల్లి గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. జార్ఖండ్ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న సిఆర్పిఎఫ్ జవాను పెరమండ్ల రాజ్‌కుమార్ (38) బుధవారం సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.వివరాల్లోకి వెళ్తే, కాట్రపల్లి గ్రామానికి చెందిన రాజ్‌కుమార్, తండ్రి బిక్షపతి. దసరా సెలవుల సందర్భంగా స్వగ్రామానికి వచ్చిన ఆయన గత రెండు రోజులుగా మౌనంగా ఉండి మానసిక ఆందోళనలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో నైలాన్ తాడుతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణం చెందాడు.ఘటన సమయంలో భార్య, పిల్లలు పుట్టింట్లో ఉన్నట్లు సమాచారం. రాజ్‌కుమార్ ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.



