- ఇరు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం
- ఖబర్‌స్తాన్ నిర్మాణాలు, భూముల కేటాయింపులు అందులో భాగమే..
- మజ్లిస్ పోటీకి దూరంగా ఉండటమూ కారణమే..
- ప్రజలు వాస్తవాలను గ్రహించాలి
- జుబ్లిహిల్స్‌లో బీజేపీని గెలిపించాలి
- మెదక్ ఎంపీ రఘునందన్‌రావు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : అధికార కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎంకు లోపాయికారి రాజకీయ ఒప్పందం జరిగిందని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. గతంలో ఎంఐఎంలో పనిచేసిన నాయకులే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులుగా రంగంలోకి వస్తుండటమే ఇందుకు నిదర్శనం అన్నారు. కాంగ్రెస్–ఎంఐఎం ఒకే తాను ముక్కలని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపుని అడ్డుకోవడమే ఈ కుట్ర వెనక అసలు ఉద్దేశ్యమని మండిపడ్డారు. అదే కాకుండా ఖబర్‌స్తాన్ నిర్మాణాలు, భూముల కేటాయింపులు కూడా ఈ రాజకీయ ఒప్పందంలో భాగమే అన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పోటీచేసే ఎంఐఎం జుబ్లిహిల్స్‌లో మాత్రం పోటీ చేయకపోవడానికి కారణమేంటని ఆయన ప్రశ్నించారు.
సీఎం బానిసలా పనిచేస్తున్నారు
నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశమంతా సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే సిద్ధాంతంతో పనిచేస్తోంది. అయితే కాంగ్రెస్ మాత్రం ఓట్ల కోసమే ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను.. మీ స్వంత నియోజకవర్గంలో స్మశానానికి స్థలం ఇవ్వలేకపోయిన మీరు, ఎందుకు ఆగమేఘాల మీద ఖబర్‌స్తాన్లకు స్థలం కేటాయిస్తున్నారో ప్రజలకు చెప్పండి. ఎవరికి బానిసలా పనిచేస్తున్నారు? అని ప్రశ్నించారు.
ఎంఐఎంతో ఆ ప్రమాదం ఉంది
ఒకప్పుడు బైన్సాలో ఎంఐఎం మేయర్ ఉన్నప్పుడు హిందూ ప్రాంతాలకు రోడ్లు రాలేదు, నీళ్లు రాలేదు, అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు అదే పరిస్థితి భాగ్యనగరానికి రావొచ్చు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తే, ఆ ఓటు వాస్తవానికి ఎంఐఎం అభ్యర్థికే పడుతుందనే విషయం ఓటర్లు గుర్తుంచుకోవాలన్నారు. జూబ్లీహిల్స్ ఓటర్లు మేధావులు, ఐటీ ప్రొఫెషనల్స్, విద్యావంతులు. మీ ఒక్క ఓటు ఈ నగర భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. భారతీయ జనతా పార్టీ మాత్రమే నగరాన్ని సమానత్వం, అభివృద్ధి, జాతీయత దారిలో నడిపించగలదన్నారు.


