- ఓట్లు దొంగిలించే మూడోసారి మోడీ ప్రధాని..
- మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావ్
- గాంధీభవన్‌లో ఓట్ చోర్ పై సంతకాల సేకరణ..
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావ్ అధ్యక్షతన మహిళ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం గాంధీ భవన్ లో జరిగింది. ఈసందర్భంగా ఓట్ చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దేశంలో ఓట్ చోరీ చేసి మూడోసారి మోడీ ప్రధాన మంత్రి అయ్యారన్నారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ విషయంలో అన్ని రకాలుగా ఆధారాలతో బయటపెట్టడంతో మోడీ, బీజేపీ బెంబేలెత్తిందని తెలిపారు. మోడీ మూడోసారి ప్రధాన మంత్రి అయ్యేందుకు ఎన్నికల కమిషన్ ను వాడుకున్నారని ఆరోపించారు. అన్ని రకాలుగా ఆధారాలతో రాహుల్ గాంధీ ఎన్నికల అక్రమాలను, ఓట్ చోర్ లను చూపించినా కూడా ఎన్నికల కమిషన్ ఏ మాత్రం స్పందించలేదని మండిపడ్డారు. ఇదే అంశంపై మహిళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున సంతకాల సేకరణ చేపడుతున్నామని, మహిళ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని సంతకాల సేకరణ చేపట్టి విజయవంతం చేయాలని సునీతారావు కోరారు.


