
- చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలో వృద్ధ దంపతులు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. గ్రామానికి చెందిన గజ్జెల శంకరయ్య (70), లక్ష్మి (65) దంపతులు సోమవారం తమ నివాసంలో అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు, వెంటనే 108 అంబులెన్స్ ద్వారా కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా శంకరయ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందగా, భార్య లక్ష్మి చికిత్స పొందుతుంది. కాగా స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా గంగాధర ఎస్ఐ వంశీకృష్ణ మాట్లాడారు. శంకరయ్య మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని, అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఎస్ఐ తెలిపారు.


