కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో నిరుద్యోగుల సమస్య మరోసారి ఊపందుకుంది. గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన అక్రమాలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద జరిగిన ఈ ఆందోళనలో జాగృతి కార్యకర్తలు, గ్రూప్-1 అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ .. గ్రూప్-1 అభ్యర్థులకు ధైర్యం ఇవ్వడానికే గన్ పార్క్ వద్ద ఈ ధర్నా నిర్వహించాము. పరీక్షల్లో జరిగిన అన్యాయంపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోంది. రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి నిరుద్యోగుల కాళ్లు పట్టుకొని ఓట్లు అడిగారు, కానీ ఇప్పుడు వారినే మోసం చేశారు. ఉద్యోగ క్యాలెండర్ ఇంతవరకు విడుదల కాలేదు. పాత నియామకాలను చూపించి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు అని విమర్శించారు. ప్రభుత్వం తీరును తీవ్రంగా ఎత్తిచూపుతూ గ్రూప్-1 పరీక్షలో అక్రమాలు జరిగాయి. ప్రభుత్వం దీనిపై మౌనం వహిస్తోంది. ఈ పరీక్ష రద్దు అయ్యే వరకు మా పోరాటం కొనసాగుతుంది. తెలంగాణలో ఉన్న మేధావులు మౌనం వీడాలి. అవసరమైతే హరగోపాల్ సార్‌ను స్వయంగా కలిసి మాట్లాడతాను అని ప్రకటించారు.
ప్రెసిడెంటల్ ఆర్డర్‌ను ఉల్లంఘించి ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎనిమిది మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇది చట్ట విరుద్ధం. ఆ అంశంపై కూడా మేము ఉద్యమం చేస్తాము అని కవిత హెచ్చరించారు.తదుపరి దశలో రాష్ట్రవ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి, నిరుద్యోగుల సమస్యలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రణాళికను తెలంగాణ జాగృతి సిద్ధం చేస్తోంది. కవిత స్పష్టం చేశారు. తెలంగాణ తెచ్చింది ఉద్యోగాల కోసం.. కానీ ఈ ప్రభుత్వం వాటిని కాపాడడంలో విఫలమైంది. నిరుద్యోగులు తమ హక్కు కోసం మళ్లీ రోడ్లపైకి రావాల్సిందే అన్నారు.


