కాకతీయ, బిజినెస్ డెస్క్: రైతులకు కేంద్రంలోని మోదీ సర్కార్ దీపావళి బహుమతిని అందించబోతుంది. ఈ స్కీములో భాగంగా జమ్మూకశ్మీర్ రైతులకు భారీ ఊరట లభించింది. ఈ పథకం కింద ప్రభుత్వం మొత్తం రూ. 171 కోట్లను విడుదల చేసింది. ఈ మొత్తం నేరుగా సుమారు 8.55 లక్షల అర్హ రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది.
జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాని నరేంద్ర మోదీ, వ్యవసాయ మంత్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. రైతులు PM-KISAN యోజన 21వ విడత ముందుగానే విడుదల కావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆర్థిక సాయం కేవలం పంటల పునరుద్ధరణకు సహాయపడటం మాత్రమే కాకుండా, రైతుల జీవనోపాధి నిలుపుకునే విధంగా మద్దతు ఇస్తుంది. మనోజ్ సిన్హా మాట్లాడుతూ.. రైతులు మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక్కలుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం వారికి పూర్తి మద్దతు అందిస్తోంది. వరదల ప్రభావం నుండి రైతులను బయటకు తేవడంలో ఈ సాయం ముఖ్యంగా ఉపశమనం ఇస్తుందని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 26న కేంద్ర ప్రభుత్వం PM-KISAN యోజన 21వ విడతను మొదటగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు, కొండచరియల కారణంగా పంటలు నష్టపోయాయి. ఈ నష్టానికి పరిహారంగా, ప్రతి రైతుకు రూ. 2,000 చొప్పున నేరుగా ఖాతాల్లోకి జమ చేసింది.
ప్రస్తుతానికి రైతులు మిగిలిన రాష్ట్రాల్లో తమ ఖాతాల్లో డబ్బు ఎప్పుడు జమ అవుతుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ స్కీమ్ ప్రకారం.. ప్రతి నాలుగు నెలలకు ఒక విడత విడుదల అవ్వుతుంది. 21వ విడతను నవంబర్‌లో విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఈసారి దీపావళికి ముందే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. రూ. 2,000 రూపాయల ఆర్థిక సాయం రైతులకు మాత్రమే కాకుండా వారి కుటుంబాలకు కూడా చిన్న పండుగలా మారనుంది..


