ప్రమాదాలకు అడ్డంగా కటాక్షపూర్ మత్తడి..!
జాతీయ రహదారి 163 పై ప్రయాణం ప్రాణపణంగా మారిన దుస్థితి
– గుంతలతో నిండిన రహదారి – వాహనదారుల దుర్భర యాతన
– వంతెన పనులు నత్తనడక – వర్షంలో నీటితో మునిగే మత్తడి
– రాత్రివేళల్లో వెలుతురు లేక ప్రమాదాల ముప్పు పెరుగుదల
– కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల మౌనం – ప్రజల్లో ఆగ్రహం
కాకతీయ, ఆత్మకూర్ :
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం పరిధిలోని కటాక్షపూర్ పెద్ద చెరువు మత్తడి ప్రస్తుతం ప్రజలకు శాపంగా మారింది. ఈ ప్రాంతం మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి 163 (హనుమకొండ – ములుగు) పై భారీ గుంతలు, అసమతుల్య రోడ్డు, నీటి నిల్వలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం రాగానే రహదారి మధ్యలో పెద్ద గుంతలు చెరువుల్లా మారిపోతున్నాయి. ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, లారీలు ఈ ప్రాంతం దాటాలంటే రిస్క్ తప్పదు. రాత్రివేళల్లో కాంతి సరిగా అందకపోవడంతో గుంతల్లో పడిపోవడం, వాహనాలు ఇరుక్కుపోవడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు.
హై లెవల్ వంతెన పనులు నిలిచిపోయి నెలలు గడిచాయి..
కటాక్షపూర్ పెద్ద చెరువు వద్ద జాతీయ రహదారి విస్తరణలో భాగంగా హై లెవల్ వంతెన నిర్మాణం ప్రారంభమైంది. కానీ పనులు నత్తనడకన సాగి, చివరికి ఆగిపోయాయి. ఫలితంగా మత్తడి మార్గం ఇప్పటికీ తెరచాప మీదే ఉంది. నిమ్మకు నీరెత్తినట్టు పనులు చేస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. స్థానిక రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ప్రతిరోజూ ఈ రూట్ మీదే వెళ్ళాల్సి రావడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంతెన పూర్తయి ఉంటే మత్తడి సమస్య ఉండేది కాదు. కానీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇప్పటికీ అదే దుస్థితి కొనసాగుతోంది అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం.. ప్రమాదాలు పెరుగుతున్నాయి..
జాతీయ రహదారి విభాగం, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు స్థల పరిశీలన చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు. పలు సార్లు ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన రాలేదని వారు ఆరోపిస్తున్నారు. మత్తడి దాటాలంటే భయమే వేస్తోంది. గుంతల్లో పడిపోతామోమో అనిపిస్తుంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల పెద్ద ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలి అని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజల డిమాండ్లు..
కటాక్షపూర్ మత్తడి వద్ద రోడ్డు మరమ్మత్తు పనులు తక్షణమే ప్రారంభించాలి. హై లెవల్ వంతెన నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలి. రాత్రివేళల్లో లైటింగ్ సదుపాయం కల్పించాలి. రహదారి పక్కన హెచ్చరిక బోర్డులు, భద్రతా సూచికలు ఏర్పాటు చేయాలి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై విచారణ జరపాలి అని స్థానికులు అంటున్న మాట. కటాక్షపూర్ మత్తడి మరిస్తే ప్రమాదాలు పెరుగుతాయి అని, రోడ్డు సరిగా ఉంటే వాహనదారులకు ఊరట లభిస్తుంది అంటూ, వెంటనే చర్యలు తీసుకోకపోతే మత్తడి మరిన్ని ప్రాణ నష్టాలకు వేదికవుతుందని వారు హెచ్చరిస్తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సీరియస్‌గా స్పందించి రహదారి పరిస్థితి మెరుగుపరచాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.


