అంగన్వాడి భవన నిర్మాణానికి ఆదిలోనే ఆటంకం
నాణ్యత లోపంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు
కాకతీయ, గీసుగొండ: అంగన్వాడి భవన నిర్మాణానికి ఆదిలోనే ఆటంకం ఏర్పడింది.నిర్మాణ దశలో ఉన్న అంగన్వాడీ భవనంలో నాణ్యత లోపాలు వెలుగులోకి వచ్చాయి. నిర్మాణం ఆది దశలోనే ఉండగా ఓ పిల్లర్ కూలిపోవడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, మండలంలోని రాంపురం గ్రామపంచాయతీ పరిధి గట్టుకింది పల్లెలో అంగన్వాడీ భవన నిర్మాణానికి రూ.20 లక్షల ఈజీఎస్ నిధులు కొద్ది నెలల క్రితం మంజూర య్యాయి. ఈ నిధులతో ఆరు పిల్లర్లతో భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. మొదట గుంతలు తవ్వి పుట్టింగ్ పూర్తి చేసిన అనంతరం సుమారు ఐదు అడుగుల ఎత్తు వరకు పిల్లర్లను లేపారు.అయితే ఆదివారం నాడు కొంతమంది గ్రామస్థులు పిల్లర్లు ఊగుతున్నట్లు గమనించి కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కొన్నిచోట్ల పిల్లర్ చుట్టూ మళ్లీ కాంక్రీట్ పోయగా, ముందు భాగంలోని ఓ పిల్లర్ పూర్తిగా ఒకవైపు కూలిపోయింది.దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు పనులను నిలిపివేశారు.“ఇలా నాణ్యత లేకుండా భవనం కట్టి చిన్నపిల్లల ప్రాణాలతో ఆటలాడతారా? అంటూ మండిపడ్డారు. ఈ ఘటనపై సంబంధిత ఏఈ వివరణ కోరగా, తాత్కాలికంగా నిర్మాణ పనులను నిలిపివేసినట్లు తెలిపారు.
*నాణ్యతా ప్రమాణాలతో అంగన్వాడీ నిర్మాణం చేపట్టాలి
అంగన్వాడి భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు లోపించడంతోనే పిల్లర్లు కూలడం జరిగిందని రాంపురం గ్రామస్తుడు దర్శనాల రాజు ఆగ్రహం వ్యక్తం చేశాడు. నాలుగేళ్లలోపు పిల్లలు, గర్భిణీలు,బాలింతలు వెళ్లే అంగన్వాడి భవనం నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలని వారి ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని ఆయన డిమాండ్ చేశారు.


