- లొంగిపోయిన సీనియర్ మావోయిస్టు మందా రూబెన్
కాకతీయ, వరంగల్ బ్యూరో : నాలుగు దశాబ్దాల అజ్ఞాత జీవితానికి తెర దించి, సీనియర్ మావోయిస్టు మందా రూబెన్ మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సమీక్షలో లొంగిపోయారు. సుమారు 44 సంవత్సరాలుగా భూగర్భంలో కార్యకలాపాలు కొనసాగించిన సీనియర్ సిపిఐ (మావోయిస్టు) నాయకుడు మందా రూబెన్ అలియాస్ కన్నన్న అలియాస్ మంగన్న అలియాస్ సురేష్ మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సమక్షంలో లొంగి పోయారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపాడు గ్రామానికి చెందిన రూబెన్, సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ (డి వి సి ) సభ్యుడిగా, దండకారన్య స్పెషల్ జోన్ కమిటీ (డీకే ఎస్ జెడ్ సి ) లో కీలక బాధ్యతలు నిర్వహించాడు. వరంగల్ పోలీసుల సమక్షంలో లొంగిపోవడం ద్వారా ఆయన సుదీర్ఘ విప్లవాత్మక జీవితం ముగిసింది. తెలంగాణ పోలీసులు అనుసరించిన పునరావాస వ్యూహాల విజయానికి ఇది మరో నిదర్శనం అని అధికారులు తెలిపారు.
మావోయిస్టులు లొంగిపోవాలి : సీపీ
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. భూగర్భ మావోయిస్టులు లొంగిపోయి తమ గ్రామాలకు తిరిగి వచ్చి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన పునరావాస పథకాలన్నీ వారికి అందిస్తామని సీపీ తెలిపారు.


