- జాతి కోసం తరతరాలు చెప్పుకునేలా పోరాడారు
- ఆదివాసీల హక్కుల కోసం త్వరలోనే ఉద్యమం
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
కాకతీయ, తెలంగాణ డెస్క్ : తెలంగాణ మన్నెంపులి, ఆదివాసీ బొబ్బిలి కొమురం భీం అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తమ జాతి కోసం ఎలా పోరాటం చేయాలో దేశం మొత్తం తరతరాలు చెప్పుకునేలా గొప్ప పోరాటం చేసిన బిడ్డ అన్నారు. కొమురం భీం వర్దంతి సందర్భంగా ట్యాంక్ బండ్‌పై విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కొంతమంది జననం చరిత్ర అయితే… మరికొందరి మరణం చరిత్ర అవుతుందన్నారు. కొమురం భీం తన మరణంతో ఆదివాసీలకు ఎన్నో హక్కులను సాధించి పెట్టారని కొనియాడారు.
మావా నాటే మావా రాజ్’ అంటే మా గూడెంలో మా రాజ్యమే ఉండాలని పిలుపునిచ్చారన్నారు. జల్, జంగిల్, జమీన్ నినాదంతో నిజాం ప్రభుత్వాన్ని తలవంచేలా చేశారని అన్నారు. ఇప్పటికీ కొమురం భీం గౌరవార్థం ప్రజా దర్భార్ నిర్వహిస్తున్నమంటే అది ఆయన గొప్పతనం అన్నారు. కొమురం భీంకు నివాళిగా జోడే ఘాట్ వద్ద స్మృతివనం కట్టుకున్నామని, తెలంగాణ వచ్చాక ఆయనకు తగిన గౌరవం ఇచ్చుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక గూడెల్లో అభివృద్ధి ఆగిపోయిందని ఆరోపించారు. మహిళలకు కనీసం ప్రసూతి సౌకర్యాలు లేని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ఆదివాసీల హక్కుల పోరాటం కోసం త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ నాయక్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ఆదివాసీ జాగృతి అధ్యక్షుడు లోకిని రాజు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ జాగృతిలో బీఎస్పీ నేతల చేరిక
తెలంగాణ జాగృతిలో కామారెడ్డి జిల్లా బీఎస్పీ నాయకులు చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సురేశ్ గౌడ్, ఎల్లారెడ్డి నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన బీఎస్పీ నాయకుడు తలారి బాలరాజ్ జాగృతిలో చేరారు. మంగళవారం బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. బడుగు, బలహీనవర్గాల పక్షాన కవిత చేస్తున్న పోరాటాలకు మద్దతునిచ్చేందుకే జాగృతిలో చేరుతున్నామని వారు ప్రకటించారు.


