- ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపణలు
- మధురా నగర్ పీఎస్‌లో ఎన్నికల అధికారి రజినీకాంత్ రెడ్డి ఫిర్యాదు
- కోడ్ అమల్లో ఉండగా ఓటర్ కార్డులు పంపిణీ !
- జూబ్లిహిల్స్ అభ్యర్థి అంటూ రాజకీయవర్గాల్లో టాక్..
- ఉప ఎన్నిక ముందు అధికార పార్టీకి షాక్ !
కాకతీయ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. మధురా నగర్ పోలీస్ స్టేషన్‌లో జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజినీకాంత్ రెడ్డి నవీన్ యాదవ్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నవీన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నవీన్ యాదవ్ ఓటర్ కార్డులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. దీన్ని ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి చర్యగా భావించిన ఎన్నికల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నవీన్ యాదవ్ మీద బీఎన్ఎస్ 170, 171, 174తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు అయ్యింది. ఎన్నికల సంఘం నిబంధనల ఉల్లంఘనల మీద అధికారుల సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
జుబ్లిహిల్స్ అభ్యర్థి అంటూ ప్రచారం..
జుబ్లిహిల్స్ ఉప ఎన్నికను అధికార పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది. అభ్యర్థి ఎంపిక విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తోంది. అయితే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్‌పై క్రిమినల్ కేసు నమోదు అవ్వడం కాంగ్రెస్‌కు ఊహించని దెబ్బ తగిలినట్లైంది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌ను అనుకున్నట్లు రాజకీయా వర్గాల్లో వార్తలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్‌పై కేసు నమోదు అవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా.. ఎన్నికల సంఘంకు ఎంపీ రఘునందన్ రావు, నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్‌లో ఓటర్ కార్డులు అందజేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ జరిపిన ఎన్నికల సంఘం.. నవీన్ యాదవ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.


