- స్వతంత్ర దేశంగా 145 దేశాలు గుర్తింపు
- ఐరాసలో అమెరికా వ్యతిరేకించడం సిగ్గుచేటు
- సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్రీనివాస్
కాకతీయ, వరంగల్ బ్యూరో : పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ జరుపుతున్న జినోసైడ్ హత్యాకాండ, దురాక్రమణ దాడులను ఖండిస్తున్నట్లు సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్రీనివాస్ అన్నారు. మంగళవారం న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రేటర్ వరంగల్ కమిటీ కార్యదర్శి రాచర్ల బాలరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం. శ్రీనివాస్ ప్రధాన అతిథిగా పాల్గొని మాట్లాడారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, బ్రిటన్ వంటి సామ్రాజ్యవాద దేశాలు తమ ఆధిపత్యం నిలుపుకునేందుకు ప్రయత్నించాయన్నారు.
అందులో భాగంగా 1948లో పాలస్తీనా భూభాగంపై కృత్రిమంగా ఇజ్రాయిల్ దేశాన్ని ఏర్పాటు చేశాయని తెలిపారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ పాలకులు పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమిస్తూ ప్రజలను ఊచకోత కోస్తున్నారని దుయబట్టారు. ఈ దుశ్చర్యలకు అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాల అండ ఉందని ఆయన విమర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలైన 145 దేశాలు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాయన్నారు. దీనిని అమెరికా వ్యతిరేకించడం తగదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా గాజా తదితర ప్రాంతాల్లో ఇజ్రాయిల్ ప్రభుత్వం జరుపుతున్న మారణకాండలో 66 వేల మంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. రెండు లక్షల మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. ఆహార సరఫరా నిలిపివేయడం వల్ల వందలాది మంది ఆకలితో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి సహాయం చేయడానికి వస్తున్న స్వచ్ఛంద సంస్థల నౌకలను ఇజ్రాయిల్ అడ్డుకుని 500 మందిని నిర్బంధించిందని ఆయన పేర్కొన్నారు.
ఇజ్రాయిల్, అమెరికా ప్రభుత్వాలు చేస్తున్న దుర్మార్గ చర్యలను ప్రపంచ ప్రజలు ఖండించాలని, పాలస్తీనా ప్రజలకు అండగా నిలవాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్, జిల్లా ప్రతినిధి గంగుల దయాకర్, మానవ హక్కుల వేదిక నాయకులు బండి కోటేశ్వరరావు, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మెడ సాంబయ్య, జిల్లా అధ్యక్షులు జక్కుల తిరుపతి, పిడిఎస్యు ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్, బన్న నర్సింగం, బండి కుమార్, అయిత యాకయ్య తదితరులు పాల్గొన్నారు.


