నాలుగు దశాబ్దాల అజ్ఞాత జీవితానికి తెర..
లొంగిపోయిన సీనియర్ మావోయిస్టు మందా రూబెన్..!
కాకతీయ, వరంగల్ బ్యూరో : నాలుగు దశాబ్దాల అజ్ఞాత జీవితానికి తెర తెంచి, సీనియర్ మావోయిస్టు మందా రూబెన్ మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సమీక్షలో లొంగిపోయారు. సుమారు 44 సంవత్సరాలుగా భూగర్భంలో కార్యకలాపాలు కొనసాగించిన సీనియర్ సిపిఐ (మావోయిస్టు) నాయకుడు మందా రూబెన్ @ కన్నన్న @ మంగన్న @ సురేష్ మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సమక్షంలో లొంగి పోయారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపాడు గ్రామానికి చెందిన రూబెన్, సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ (డి వి సి ) సభ్యుడిగా, దండకారన్య స్పెషల్ జోన్ కమిటీ (డీకే ఎస్ జెడ్ సి ) లో కీలక బాధ్యతలు నిర్వహించాడు. వరంగల్ పోలీసుల సమక్షంలో లొంగిపోవడం ద్వారా ఆయన సుదీర్ఘ విప్లవాత్మక జీవితం ముగిసింది. తెలంగాణ పోలీసులు అనుసరించిన పునరావాస వ్యూహాల విజయానికి ఇది మరో నిదర్శనం అని అధికారులు తెలిపారు.
విప్లవ పంథాలోకి అడుగు..
1979లో వరంగల్‌లోని రీజినల్ ఇంజనీరింగ్ కాలేజ్ (ప్రస్తుతం ఎన్ ఐ టి ) హాస్టల్ మెస్‌లో పని చేస్తున్నప్పుడు రూబెన్ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ కార్యక్రమాల ద్వారా విప్లవ భావ జాలానికి ఆకర్షితుడయ్యాడు. 1981లో సిపిఐ (మావోయిస్టు) మాజీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (గణపతి) పిలుపుతో అజ్ఞాతంలోకి వెళ్లాడు. తర్వాతి దశాబ్దాల్లో ఆయన కుంట, కేష్కల్, అబుజ్మద్, నార్త్ బస్తర్ ప్రాంతాల్లో దళ సభ్యుడు, ఏరియా కమిటీ సభ్యుడు, అనంతరం డివిజన్ కమిటీ కార్యదర్శిగా సేవలందించాడు.
నేర చరిత్ర..
భూగర్భ జీవితంలో ఆయన పలు పెద్ద మావోయిస్టు దాడుల్లో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. వాటిలో ముఖ్యమైనవి.. 1988 గొల్లపల్లి, మరాయిగూడ దాడి 20 మంది సి ఆర్ పి ఎఫ్ సిబ్బందిని హతమార్చాడు. 1988 యేటిగట్టు దాడి లో 8 మంది జిల్లా పోలీసులను హతమార్చాడు. 1990 లో తర్లగూడ పోలీస్ స్టేషన్ దాడి అలాగే 1991లో జగదల్‌పూర్ జైలు బ్రేక్ ఘటనలో కూడా ఆయన కీలక పాత్ర పోషించాడు. 1999లో ఆయనకు డివిజన్ కమిటీ సభ్యుడిగా పదోన్నతి లభించింది. అదే సంవత్సరం సీనియర్ నాయకులు రవుల శ్రీనివాస్ (రామన్న), గోపన్న ఆధ్వర్యంలో ఆయన వివాహం జరిగింది.
ప్రజా స్రవంతిలోకి తిరుగు ప్రయాణం..
2005లో అనారోగ్యం కారణంగా పార్టీ కార్యకలాపాల నుంచి వైదొలగిన రూబెన్, తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గుండ్రాయి గ్రామంలో నివసించడం ప్రారంభించాడు. ప్రభుత్వం చేపట్టిన పునరావాస పథకాలు, పోలీసులు చూపిన మద్దతు ప్రభావంతో ఆయన ప్రజా జీవితంలోకి తిరిగి రావాలని నిర్ణయించాడు. మంగళవారం ఆయన వరంగల్ పోలీస్ కమిషనర్ సమక్షంలో లొంగిపోయి, ఇకపై శాంతియుత జీవితం గడపాలని ప్రకటించాడు.
మావోయిస్టులు గ్రామాలకు తిరిగి రండి : సీపీ
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. భూగర్భ మావోయిస్టులు తమ గ్రామాలకు తిరిగి వచ్చి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ప్రభుత్వం ప్రకటించిన పునరావాస పథకాలన్నీ వారికి అందిస్తాం, అని తెలిపారు. అలాగే, లొంగిపోయిన సభ్యుల పునరావాసం, జీవనోపాధి కోసం ప్రభుత్వం నుంచి అందించే అన్ని సౌకర్యాలు నిర్ధారిస్తాం, అని కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ హామీ ఇచ్చారు.
యువత దూరం.. మావోయిజం క్షీణత..
పోలీసులు తెలిపిన ప్రకారం.. నేటి యువత చైతన్య వంతంగా, బాధ్యతతో వ్యవహరిస్తూ చట్టవిరుద్ధ మార్గాలకు దూరంగా ఉండి,
మావోయిస్టు పార్టీలోకి కొత్తగా విద్యార్థులు చేరడం దాదాపు పూర్తిగా ఆగిపోయిందని అధికారులు వెల్లడించారు. మావోయిజం ఇప్పుడు కాలం చెల్లిన భావజాలంగా మారిందని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు హింసను తిరస్కరిస్తున్నారని తెలిపారు. నాలుగు దశాబ్దాలపాటు భూగర్భంలో కొనసాగిన విప్లవ జీవితం ముగించుకుని, ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన మందా రూబెన్ నిర్ణయం తెలంగాణలోని మావోయిస్టు కార్యకలాపాలపై ప్రభావం చూపనుంది. హింస మార్గాన్ని విడిచి, శాంతి మార్గంలో అడుగుపెట్టిన రూబెన్ మావో యిజం కాలం చెల్లింది, ప్రజల అభివృద్ధే నిజమైన మార్గం అనే సందేశాన్ని సమాజానికి ఇచ్చినట్టుగా పోలీసులు వ్యాఖ్యానించారు.


