కాకతీయ, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై చేపట్టిన చర్చలు సఫలమయ్యాయి. పెండింగ్ వేతనాలు సహా అనేక సమస్యల పరిష్కారానికి అధికారుల నుంచి హామీలు లభించాయి. సోమవారం మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో కార్మికుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చలు నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పీఏ ఆకుల చంద్రశేఖర్, పెద్దపల్లి డీసీఏచ్‌ఎస్ డాక్టర్ శ్రీధర్, మంథని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్, కాంట్రాక్టర్ అఖిల్ పాల్గొన్నారు. కార్మికుల తరఫున సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గణేష్, ఎస్ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్ హాజరయ్యారు.
కార్మికులు అక్టోబర్ 1న సీఐటీయూ ఆధ్వర్యంలో మంత్రి కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. వెంటనే స్పందించిన మంత్రి అదే రోజు సాయంత్రం నాలుగు నెలల పెండింగ్ వేతనాలను కార్మికుల ఖాతాల్లో జమ చేయించారు. మిగిలిన రెండు నెలల వేతనాలను ప్రభుత్వం నుంచి నిధులు వచ్చిన వెంటనే చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ప్రతి నెలా జీతాలు నిర్దేశిత తేదీలో చెల్లిస్తామని, ప్రతి కార్మికుడికి పీఎఫ్, ఈఎస్‌ఐ సదుపాయాలు అందుబాటులోకి తేస్తారని అధికారులు తెలిపారు. కార్మికుల సెలవులు, ఇతర సమస్యల పరిష్కారానికీ కృషి చేస్తామని వారు వెల్లడించారు. ఈ చర్చలలో హాస్పటల్ కార్మికులు శ్రావణ్, భరత్, అనిల్, శ్రీకాంత్, పూర్ణిమ, రమాదేవి, లక్ష్మి, రజిత తదితరులు పాల్గొన్నారు.


