- సమస్యలు లేని సామాజిక తెలంగాణే కవిత లక్ష్యం
- కరీంనగర్ జిల్లా జాగృతి అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కేంద్రంలో సోమవారం తెలంగాణ జాగృతిలోకి బీసీ కుల సంఘాల నాయకులు శ్రీరాముల రమేష్, గర్షకుర్తి విద్యాసాగర్, కోత్వాల అంజనేయులు తదితరులు చేరారు. వారికి జిల్లా జాగృతి అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ.. కవిత నాయకత్వంలో తెలంగాణ జాగృతి కరీంనగర్ జిల్లాలో బలోపేతం అవుతోందని తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, మన అస్తిత్వాన్ని కాపాడటమే జాగృతి ప్రధాన లక్ష్యమని అన్నారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో కవిత జాగృతిని స్థాపించారని, ఇప్పుడు జిల్లాలో జాగృతి, సంఘాలను మరింత బలోపేతం చేస్తామని అన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. కోర్టు బిల్లు కొట్టివేస్తే ప్లాన్-బి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కానీ బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ మోసం చేస్తే ప్రజలు కాంగ్రెస్‌ను ఖతంచేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడి పోతోందని, సమస్యలు లేని సామాజిక తెలంగాణ సాధించటమే కవిత నిజమైన లక్ష్యమని గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.


