- డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్
కాకతీయ, నర్సింహులపేట : రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. సోమవారం నర్సింహులపేటలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం మండల అధ్యక్షుడు మైదం దేవేందర్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రెడ్యానాయక్ మాట్లాడారు. రానున్న స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలన్నారు. బాకీ పడ్డ గ్యారెంటీ కార్డులను కార్యకర్తలు గ్రామగ్రామానపంపిణీ చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ పాలన రావాలంటే స్థానిక ఎన్నికలు అందుకు పునాదులుగా వేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని, ఎన్నికలు ఏవైనా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
అమలు కానీ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను, మహిళలను నిరుద్యోగులను, సబ్బండ వర్గాలను మోసం చేసిందన్నారు. ఈ ఎన్నికల్లో వారికి ఓటమి తప్పదని, బీఆర్ఎస్ శ్రేణులు ఐకమత్యంగా పనిచేసి ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఎన్నుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మైదం దేవేందర్, మాజీ వైస్ఎంపీపీ దేవేందర్, సువీ ర్ రెడ్డి, నరసింహారెడ్డి, ఖా జామియా, జగదీశ్వర్, రామన్న, సురేష్, మారపంగు వీరన్న ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.


