- ఉప ఎన్నిక అభ్యర్థిపై తర్జనభర్జన
- రేపు రాష్ట్ర ఎన్నికల కమిటీ భేటీ..
- ఎల్లుండి క్యాండిడేట్‌ను ప్రకటించే ఛాన్స్ !
- రేసులో కీర్తిరెడ్డి, దీపక్‌రెడ్డి?
కాకతీయ, తెలంగాణ బ్యూరో: జుబ్లిహిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ ఫోకస్ పెంచింది. ఇవ్వాళ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో అభ్యర్థి ఎంపికపై దృష్టి సారించింది. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ధీటుగా సరైన వ్యక్తిని పోటీకి దించాలని కసరత్తు చేస్తోంది. ఈమేరకు రేపు (మంగళవారం) బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీ భేటీకానుంది. ఈ సమావేశంలోనే అభ్యర్థిని ఖరారుచేసే ఛాన్స్ ఉంది. ముగ్గురు పేర్లతో కూడిన జాబితాను అధిష్టానానికి పంపి గ్రీన్ సిగ్నల్ రాగానే బుధవారం క్యాండిడేట్‌ను ప్రకటించన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జుబ్లిహిల్స్ ఉప ఎన్నిక రేసులో జూటూరు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, లంకల దీపక్‌రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
- ఆ ఇద్దరిలో ఒకరు..?
2023 అసెంబ్లీ ఎన్నికల్లో జుబ్లిహిల్స్ నుంచి లంకల దీపక్‌రెడ్డి పోటీచేసి మూడో స్థానానికి పరిమితమయ్యారు. ప్రస్తుతం బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయనకే టికెట్ దక్కే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆయనకు టికెట్ ఇవ్వని పక్షంలో జూటూరు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మకు టికెట్ దక్కే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సన్నిహితుడిగా ఉన్న దీపక్‌రెడ్డి, కీర్తిరెడ్డిలో ఒకరికి టికెట్ ఇస్తారని పార్టీలో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే అభ్యర్థి ఎవరనే విషయంలో క్లారిటీ రానుంది.


