నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఎన్నిక
14వ తేదీన కౌంటింగ్.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
కాకతీయ, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. నవంబర్ 11వ తేదీన పోలింగ్, 14వ తేదీన కౌంటింగ్ ఉంటుందని తెలిపింది. బీఆర్ ఎస్ ఇప్పటికే మాగంటి సునీతను పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు పేర్లను షార్ట్ లిస్టు చేసిన అధిష్ఠానం నవీన్ యాదవ్‌ను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ అభ్యర్థిపై కాంగ్రెస్ కసరత్తు చివరి అంకానికి చేరింది. సర్వే ఆధారంగా ముగ్గురు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశారు ఇంచార్జ్ మంత్రులు. ఢిల్లీలో సోమవారం జరగున్న స్క్రీనింగ్ కమిటీకి డిటెయిల్స్ పంపనుంది పీసీసీ. రాష్ట్ర నాయకత్వం నవీన్ యాదవ్, బొంతు రాంమోహన్, సీఎన్ రెడ్డి పేర్లు ఫైనల్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు తాను కూడా టికెట్ రేసులో ఉన్నానంటున్నారు అంజన్ కుమార్ యాదవ్. ఇక బీజేపీ అభ్యర్థి విషయంలో ఇంకా కసరత్తు కొనసాగుతోంది. తాజాగా జయసుధతో పాటు మరికొంతమంది బీసీ లీడర్ల పేర్లు సైతం తెరపైకి వస్తుండటం గమనార్హం. ఈనేపథ్యంలో ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుందనే చెప్పాలి.


