కాంగ్రెస్‌కు బాకీ కార్డు ఎఫెక్ట్
స్థానిక ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ ఎస్ రాజకీయ అస్త్రం
కాంగ్రెస్ వైఫల్యాలపై ఇంటింటికి కార్డుల పంపిణీ
ప్రభుత్వంపై జనాగ్రహం స్పష్టమవుతోందన్న ధీమాలో గులాబీ లీడర్లు
క్యాడర్‌లోనూ పెరిగిన జోష్… మాజీ ఎమ్మెల్యేలు సైతం ఆక్టివ్
తప్పికొట్టాలని కాంగ్రెస్ అధినాయకత్వం క్యాడర్‌కు పిలుపు
కౌంటర్ అటాక్‌కు దూరంగానే కాంగ్రెస్ క్యాడర్..!
ఎమ్మెల్యేలూ సైతం పట్టించుకోకపోవడంపై అధిష్ఠానం సీరియస్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ బాకీ కార్డు నిరసనను బీఆర్ ఎస్ పార్టీ ఉదృతం చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 22నెలల పాలనలో ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఇస్తామని చెప్పిన తులం బంగారం బాకీ పడ్డారని, వికలాంగుల పెన్షన్ నెలకు 6000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి 22 నెలలకు 44 వేల రూపాయలు బాకీ పడ్డారని గ్రౌండ్‌లో ప్రచారం నిర్వహిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అడ్డగోలుగా హామీలిచ్చి.. నమ్మబలికి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ గద్దెనెక్కిందని, అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఫ్రీ బస్సు ఒక్కటి మినహా ఏ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేదని పేర్కొంటూ బీఆర్ ఎస్ పార్టీ విమర్శిస్తూ వస్తోంది. ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసేంత వరకు తాము కాంగ్రెస్ పార్టీ వెంటాపడుతూనే ఉంటామని, ప్రజలకు అన్యాయం చేస్తున్న రేవంత్ సర్కారు భరతం పట్టడమే బీఆర్ ఎస్ లక్ష్యమంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలుమార్లు ఉద్ఘాటించారు. స్థానిక ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని బీఆర్ ఎస్ పార్టీ చేపడుతున్న ఈ నిరసన కార్యక్రమానికి క్షేత్రస్థాయిలో అనుహ్య రాజకీయ స్పందన కనిపిస్తోందని ఆ పార్టీ లీడర్లు ధీమాగా చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలను బాకీగా పేర్కొంటూ ఇంటింటికి వెళ్తూ.. కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను అందజేస్తున్నారు.

గళం వినిపించలేకపోతున్న కాంగ్రెస్..
రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలను, అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ, ప్రభుత్వ పెద్దలు క్యాడర్‌కు సూచిస్తూ వస్తున్నారు. మన విజయాలు మనం చెప్పుకోకుంటే పార్టీకి తీవ్రమైన నష్టం జరుగుతుందని చెబుతూ వస్తున్నారు. ఉన్నంతలో రైతు రుణమాఫీ ఒకటి, మహిళలకు ఫ్రీ బస్సు పథకం, ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు కొంత బలంగా కనిపిస్తున్నాయి. అయితే ఇటీవల యూరియా కొరత అంశం రైతాంగంలో పూర్తి వ్యతిరేకతను మూటగట్టుకునేలా చేసింది. 2లక్షలకు మించిన రుణం ఉన్న రైతులకు మాఫీ కాలేదు. ఆలోపు ఉన్న రైతులకు ఉన్న కొంతమంది రైతులకు కూడా మాఫీ కాలేదు. ఇక మహిళలకు నెలకు రూ.4వేల అందజేసే పథకం, పించన్ల 4వేలకు పెంపు, కొత్త పింఛన్లు వంటి హామీలను ప్రభుత్వం పెండింగ్ పెడుతూ వస్తోంది. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా అరకొరగా మంజూరీలే జరిగాయని, అందులోనూ అనర్హుల పాలే ఎక్కువగా ఉందన్న విమర్శలు గ్రామీణ జనం నుంచి ఎక్కువగా వినిపిస్తోంది. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం చెబుతున్న విధంగా క్షేత్రస్థాయిలో క్యాడర్ పార్టీ, ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బలంగా గళం వినిపించలేకపోతోందన్న అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల నుంచే వ్యక్తమవుతుండటం గమనార్హం.
ఇరకాటంలో అధికార పార్టీ..!
గులాబీ పార్టీ చేపట్టిన కాంగ్రెస్ బాకీ కార్డు కార్యక్రమానికి క్షేత్రస్థాయిలో మంచి రాజకీయ స్పందన వస్తుండటంతో ఆపార్టీ క్యాడర్‌లో జోష్ కనిపిస్తోంది. ఈ కార్యక్రమానికి ముందు కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి అంటీ ముట్టనట్లుగా ఉంటూ వస్తున్న మాజీ ఎమ్మెల్యేలు.. అనుచరుల ఫీడ్ బ్యాక్‌తో మళ్లీ ఆక్టివ్ అయ్యారు. స్వయంగా నియోజకవర్గాల్లో జరుగుతన్న ఇంటింటికి బాకీ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటుండటం గమనార్హం. పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు ప్రదర్శన, పంపిణీల్లో ముఖ్య నేతలతో పాటు మండలాల్లోని ద్వితీయ శ్రేణి క్యాడర్ విస్తృతంగా పాల్గొంటూ వస్తోంది. సమీప భవిష్యత్‌లోనే స్థానిక ఎన్నికలు ఉండటం కూడా ఇందుకు కారణమవచ్చు కాని… బీఆర్ ఎస్ పార్టీ చేపట్టిన బాకీ కార్డు నిరసన కార్యక్రమాలకు ప్రజల నుంచి అనుహ్య స్పందన లభిస్తుంటం చేతి పార్టీలో మాత్రం కలవర పాటుకు గురి చేస్తోందనే చెప్పాలి. వాస్తవానికి చాలా సీరియస్‌గా బీఆర్ ఎస్ నాయకత్వం బాకీ కార్డు కార్యక్రమాన్ని జనంలోకి తీసుకెళ్తుండగా.. బీఆర్ ఎస్ పార్టీ రివర్స్ కౌంటర్ ఇచ్చేందుకు ఎమ్మెల్యేలుగానీ, వారి అనుచర వర్గంగాని స్టెప్ తీసుకోకపోవడం గమనార్హం. బీఆర్ ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారాలపై కౌంటర్ ఇవ్వాలని పార్టీ అధినాయకత్వం నుంచి సూచనలు… ఆదేశాలు అందినా ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్నారనరి సమాచారం.


