కాకతీయ, నేషనల్ డెస్క్: గత రెండు సంవత్సరాల్లో బిహార్లో సుమారు 50 లక్షల యువతకు ఉపాధి కల్పించామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. యువత ప్రతిభను మరింత అభివృద్ధి చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి స్థాయి కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.ఆర్జేడీ, కాంగ్రెస్ పాలనతో పోలిస్తే నితీశ్ ప్రభుత్వం విద్యా రంగానికి భారీగా నిధులు కేటాయించిందని మోదీ గుర్తుచేశారు.
విద్యా బడ్జెట్ పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా పాఠశాలలు స్థాపించబడ్డాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బిహార్లోని 19 జిల్లాలకు కేంద్రీయ విద్యాలయాలు ఆమోదించిందని, రాష్ట్ర ప్రభుత్వం స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ పథకం ద్వారా విద్యార్థులను ఉన్నత విద్యకు ప్రోత్సహిస్తోందని ఆయన వివరించారు.
బిహార్లో యువత సంఖ్య అధికంగా ఉన్నందున, వారి సామర్థ్యం పెరిగితే దేశ బలం కూడా పెరుగుతుందని ప్రధాని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో ఉద్యోగాల లేమి, అభివృద్ధి ఆగిపోవడం వల్ల యువత నష్టపోయారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం వేగంగా ముందుకు సాగుతుందని చెప్పారు.
ప్రస్తుతం భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడానికి సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు. ఈ క్రమంలో బిహార్ యువతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రధాని మోదీ ‘పీఎం-సేతు’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం విద్యార్థుల విద్యా ప్రగతికి, నైపుణ్యాభివృద్ధికి తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు.


