- కాంగ్రెస్ మంద బుద్ధి ప్రభుత్వం
- ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టి పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు
- సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : వందేళ్ల ముందు చూపు కేసీఆర్‌ది అయితే.. మంద బుద్ధి కాంగ్రెస్ పార్టీదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. టిమ్స్ ఎల్బీనగర్ ఆసుపత్రి నిర్మాణ పనులను మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ యాదవ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. రెండేళ్లుగా టిమ్స్ ఆసుపత్రులను పడావు పెట్టిన చేతగాని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ లను పూర్తి చేసి, వినియోగంలోకి తేవడంలో ప్రభుత్వం ఫెయిలైందన్నారు.
మెడికల్ కాలేజీల రద్దు దుర్మార్గం
కేసీఆర్ మీద కక్షతో ఆసుపత్రులపై పగ పెంచుకోవడం దారుణమని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు కాపాడే ఆసుపత్రులతో రాజకీయాలు చేయడం తగదని హితవుపలికారు. డేట్లు, డెడ్ లైన్లు మారాయి తప్ప పనులు పూర్తి కావడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ మంజూరు చేసిన మహేశ్వరం, కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలను రద్దు చేయడం దుర్మార్గం అన్నారు. బస్తీ దవాఖానలకు సుస్తీ పట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. ఒకటో తేదీనే జీతాలు అన్న రేవంత్ రెడ్డి, 6 నెలలుగా బస్తీ వైద్యులకు, సిబ్బందికి ఎందుకు వేతనాలు చెల్లించలేదని ప్రశ్నించారు.
తిరుగుబాటు తప్పదు..
రూ. 1400 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టి పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని హరీష్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కంటి వెలుగు పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో పురోగమనం, కాంగ్రెస్ పాలనలో తిరోగమనంలో తెలంగాణ ఉందన్నారు. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆసుపత్రుల పనులు యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.
పేదలకు వైద్యంచేరువ చేశాం..
కేసీఆర్ కరోనా తర్వాత వందేళ్ల ముందు చూపుతో హైద్రాబాద్ చుట్టూ నలువైపులా నాలుగు టిమ్స్ ఆసుపత్రులు నిర్మించ తలపెట్టారన్నారు. పేదల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని, నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ వైద్యం ప్రజలకు చేరువ చేసేలా నాలుగు టిమ్స్ ఆసుపత్రులు, వరంగల్ హెల్త్ సిటీ పనులను ప్రారంభించి నిధులు కేటాయించారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు ముందుకు పోవడం లేదని విమర్శించారు. భూసేకరణ, టెండర్లు, డిజైన్లు పూర్తి చేసింది, నిధులు ఇచ్చింది…ఇవన్నీ పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఉంటే ఆసుపత్రి పనులు ప్రారంభమై, ప్రజలకు సేవలు అందించేదని అన్నారు.


