- వరంగల్ క్రైమ్ ఏసీపీ సదయ్య
కాకతీయ, వరంగల్ బ్యూరో : కుటుంబ వ్యవస్థను పరిరక్షించాల్సిన బాధ్యత మహిళా పోలీసులపై ఉందని క్రైమ్ ఏసీపీ సదయ్య పేర్కొన్నారు. శనివారం రంగంపేటలోని వరంగల్ మహిళా పోలీస్ స్టేషన్–1లో ఆయన వార్షిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా స్టేషన్‌కు సంబంధించిన వివిధ రికార్డులు, కేసు సీడి ఫైళ్లను పరిశీలించారు. పెండింగ్ కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసులు, నిందితుల అరెస్టు వివరాలను స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సూర్యప్రసాద్ నుండి ఏసీపీ అడిగి తెలుసుకున్నారు. అలాగే స్టేషన్ సిబ్బందితో శాఖాపరమైన సమస్యలు, అవసరాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఏసీపీ సదయ్య మాట్లాడుతూ.. భార్యాభర్తల మధ్య కలిగే కుటుంబ విభేదాలపై స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులను అత్యంత శ్రద్ధగా పరిశీలించాలని సూచించారు. బాధితులకు సరైన కౌన్సెలింగ్ నిర్వహించి, వారిలో సఖ్యతను నెలకొల్పడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని తెలిపారు. బాధిత మహిళలకు న్యాయం చేయడంలో సానుభూతితో వ్యవహరించాలని సిబ్బందిని ఆదేశించారు. మహిళా పోలీసుల సేవల ద్వారా సమాజంలో కుటుంబ బంధాలను కాపాడి, మహిళా భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.


