- కేంద్రానికి వచ్చే మూడేళ్లు కీలకం
- బీజేపీ శ్రేణులకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దిశానిర్దేశం
- హాజరైన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్..
కాకతీయ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వానికి వచ్చే మూడేళ్లు చాలా కీలకమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రతి శాఖ అనేక కొత్త సంస్కరణలు తీసుకువస్తోందని.. వీటితో కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొవాలని సూచించారు. వర్తమాన ప్రజల ఆలోచనలకు అనుగుణంగా చట్టాలు తేవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆలోచిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇవాళ హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ స్టేట్ లీగల్ సెల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. బీజేపీ తెలంగాణ చీఫ్ రాంచందర్ రావు, ఎంపీలు కే.లక్ష్మణ్, రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కోర్టుల్లో వాదనలే కీలకం..

అర్జున్ రామ్ మేఘవాల్ ఐఏఎస్‌గా ఉన్నప్పటికీ రాజీనామా చేసి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారని ప్రశంసించారు. బీజేపీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేయాలని దిశానిర్దేశం చేశారు. కేంద్రం పాలసీలకు అనుగుణంగా కోర్టుల్లో మనం వాదిస్తామనేది చాలా కీలకమని తెలిపారు. రానున్న మూడేళ్లు మోదీ ప్రభుత్వానికి చాలా కీలకమని ఉద్ఘాటించారు. అందుకు ప్రత్యేకమైన శిక్షణ తరగతులు నిర్వహించాలని మార్గనిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వ స్టాండ్ బలంగా వినిపించేందుకు ఎఫర్ట్ పెట్టాలని సూచించారు. తెలంగాణలో అధికారంలోకి బీజేపీ రావాలి అంటే అందరం కలసి కట్టుగా పని చేయాలని కిషన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.
కాలంచెల్లిన చట్టాలను మోదీ రద్దు చేశారు: ఎంపీ లక్ష్మణ్
కాలం చెల్లిన చట్టాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ రద్దు చేశారని బీజేపీ ఎంపీ కే.లక్ష్మణ్ తెలిపారు. దేశాన్ని ఆర్థికంగా విచ్చిన్నం చేసేందుకు ఇతర దేశాలు కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. ప్రధాని మోదీ విజనరీ లీడర్ కాబట్టి వేగంగా స్పందిస్తున్నారని చెప్పుకొచ్చారు. జీఎస్టీ తగ్గింపుతో మోదీ దీపావళి వెలుగులను పేదల ఇళ్లల్లో నిప్పుతున్నారని వివరించారు. అగ్రదేశాలు అడ్డగోలు టారిఫ్‌లతో భారతదేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇండియా ఎదుగుదలను చాలా దేశాలు జీర్ణించుకోలేక పోతున్నాయని ఫైర్ అయ్యారు. స్వదేశీ వస్తువుల వినియోగించడం ద్వారా.. భారతదేశ ఆదాయం ఇతర దేశాలకు వెళ్లకుండా ఉంటుందని వెల్లడించారు. దీని ద్వారా పెట్టుబడులు పెరుగుతాయని… ఇతరులకు ఉపాధి కలుగుతోందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు.


