కాకతీయ, నేషనల్ డెస్క్: కరూర్‌లో టీవీకే పార్టీ (TVK) అధినేత, నటుడు విజయ్ నిర్వహించిన ర్యాలీ సమయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎస్ అధికారి అస్రాగార్గ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించింది.
ర్యాలీ సందర్భంగా జనసందోహాన్ని నియంత్రించడంలో పార్టీ ఎందుకు విఫలమైందని హైకోర్టు టీవీకే నేతలను ప్రశ్నించింది. ఘటన తర్వాత పార్టీ నేతలు బాధితులను ఎందుకు పట్టించుకోలేదని కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు, టీవీకే చీఫ్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదని కూడా కోర్టు ప్రశ్నించింది. ఈ ఘటనకు సంబంధించిన కేసులో, టీవీకే నామక్కల్ జిల్లా కార్యదర్శి సతీష్‌కుమార్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
ఇక, తొక్కిసలాట బాధితులకు అదనపు పరిహారం కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కూడా హైకోర్టు విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తన స్పందన తెలియజేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. కరూర్ ఘటనపై SIT పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.


