కాకతీయ, నేషనల్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లా నందనవాడీ గ్రామంలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. ప్రభుత్వ ఉద్యోగ భయంతో ఓ టీచర్, తన భార్యతో కలిసి నాలుగో సంతానం పసికందును బండరాయి కింద పాతిపెట్టారు. ఈ ఘటన గత నెల 28వ తేదీ తెల్లవారుజామున శిశువు ఏడుపుతో బయటకు వచ్చింది. మార్నింగ్ వాకర్స్ శిశువు ఏడుపును విన్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ గుక్కపట్టి ఏడుస్తున్న మూడు రోజుల వయస్సు కలిగిన పసికందును బండరాయి కింద చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులు సమాచారం అందించారు.
పోలీసులు పసికందును చేరదీసి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. శిశువు తల్లిదండ్రులను పోలీసులు గుర్లించారు. దంపతుల పేర్లు బాబూ దండోలియా (38) రాజకుమారి అని పేర్కొన్నారు. విచారణలో వారు ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారని, తాము నందనవాడీ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులకు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఏ ఉద్యోగికి ఇద్దరికి మించి పిల్లలు ఉండకూడదని తెలుసుకున్న భయంతో, నాలుగో సంతానం పసికందును బండరాయి కింద పాతిపెట్టినట్లు వారు తెలిపారు.
ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి, శిశువు, తల్లిదండ్రుల డీఎన్ఏ నమూనాలను పరీక్షకు పంపించారు. రిపోర్టు రాగానే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైద్యులు వెల్లడించిన ప్రకారం, శిశువు శరీరంపై గాయాలు, చీమల దాడులు ఉండగా, ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిపారు. తల్లిదండ్రుల విషయంపై స్పష్టత వచ్చే వరకు శిశువును ప్రభుత్వ సంరక్షణలోని శిశు గృహంలో ఉంచారు.
జిల్లా విద్యాశాఖ అధికారి గోపాల్ సింగ్ బఘేల్ తెలిపినట్లుగా, 2001 జనవరి 26 తర్వాత మూడో సంతానం పుట్టితే ఉద్యోగం తొలగించేలా మధ్యప్రదేశ్ విద్యాశాఖలో నిబంధనలు ఉన్నాయి. ఈ నియమాలను జనాభా నియంత్రణకు తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే కొంతమంది కోర్టును ఆశ్రయించి ఉపశమనం పొందుతున్నారని కూడా తెలిపారు.


