కాకతీయ, నేషనల్ డెస్క్: రాజస్థాన్ రాష్ట్రం సికార్ జిల్లాలో ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కారును ఎద్దు ఢీకొట్టిందని ఎద్దును అత్యంత క్రూరంగా చంపేశారు. ఈ సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది.
స్థానికుల సమాచారం ప్రకారం, ఒక పెళ్లి ఊరేగింపు వెళ్తుండగా ఎద్దు వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో వాహనం ముందు భాగానికి స్వల్ప నష్టం జరిగింది. దీనితో కోపోద్రిక్తులైన వాహనంలో ఉన్నవారు ఎద్దును వెంబడించారు. కొంత దూరం వెనకాల తరుముకుని వెళ్లి, కారుతో బలంగా ఢీకొట్టారు. ఆ దెబ్బతో ఎద్దు కిందపడగా, డ్రైవర్ అక్కడితో ఆగకుండా వాహనాన్ని దాని మెడపై నుంచి నడిపి చంపేశాడు.
ఈ దారుణాన్ని ప్రత్యక్షంగా చూసిన గ్రామస్తులు డ్రైవర్‌ను అడ్డుకునే ప్రయత్నించినా, అతను పట్టించుకోలేదు. కొంతమంది ఈ ఘటనను తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది. సంఘటన తర్వాత డ్రైవర్, అతని సహచరులు అక్కడి నుంచి తప్పించుకున్నారు.
ఈ ఘటనపై స్థానికులు, గో రక్షణ సమితి సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు. రాత్రి పొద్దుపోయే వరకు వారి నిరసన కొనసాగింది. అరెస్టులు జరగకపోతే తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
వీడియో ఆధారాలను సేకరించిన పోలీసులు, ఎద్దు మృతదేహాన్ని పరిశీలించారు. నిందితులను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.
Sikar, Rajasthan: A car driver intentionally rammed into a bull standing in the middle of the road.
— Deadly Kalesh (@Deadlykalesh) October 2, 2025


