- రూ. 5500 కోట్ల కాంట్రిబ్యూషన్ పెన్షన్ డబ్బులను మళ్ళించిండ్రు..
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. దసరా పండుగకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం 3 శాతం డీఏ మంజూరు చేస్తూ తీపి కబురు చెప్పిందని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ ఉద్యోగులకు చేదు ఫలితాలను అందిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు పెండింగ్ డీఏ తక్షణమే చెల్లిస్తామని చెప్పి ఇప్పుడు 5 డీఏలు బకాయి పెట్టారంటూ విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఇంత చిన్న చూపు అని ప్రశ్నించారు.
73 శాతం గరిష్ట పీఆర్సీ అందించాం..
ఇవ్వాళ సిద్దిపేటలో మీడియాతో హరీష్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అభయహస్తం కాదని.. భస్మాసుర హస్తమని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 73శాతం గరిష్ట పీఆర్సీ అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వాన్నిదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ సిబ్బందికి 14 డీఏలు ఐదు సిలిండర్లు పెండింగ్ పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. 5500 కోట్ల కాంట్రిబ్యూషన్ పెన్షన్ డబ్బులును రాష్ట్ర ప్రభుత్వం మళ్ళించిందని హరీష్రావు ఆరోపించారు.
పీఆర్సీ తక్షణమే ప్రకటించాలి
ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగిన ఉద్యోగ సంఘాల నాయకులపై అక్రమ కేసులు పెడతామని బెదిరించడం దుర్మార్గమని హరీష్ రావు మండిపడ్డారు. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం దెబ్బతీసిందని విమర్శించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని, ఉద్యోగుల పీఆర్సీ ప్రకటించాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ తక్షణమే విడుదల చేయాలని, ఉద్యోగులు అలవెన్స్లు ఏరియల్స్ పెండింగ్లో ఉన్న వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అన్నీ బందే..
రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నెలలు, నాలుగు నెలలు, ఆరు నెలల జీతం పెండింగ్లో ఉందని హరీష్రావు ఆరోపించారు. ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లో కాస్మోటిక్ లకు, వాచ్మెన్లకు నెలల తరబడి జీతం చెల్లించడం లేదన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాచ్ గాడ్లకు 12 నెలల నుంచి జీతాలు రావడం లేదని, ఆశా వర్కర్లను రోడ్డెక్కించారని మండిపడ్డారు. రేషన్ డీలర్లు కూడా మూడో తారీకు నుండి రేషన్ షాపులు బంద్ చేస్తామంటున్నారన్నారు. రాష్ట్రంలో హాస్పటళ్లు బందు, కాలేజీలు బందు, రేషన్ షాపులు బందు అన్నారు. ఆరోగ్యశ్రీ డబ్బులు సంవత్సరం నుండి చెల్లించడం లేదని ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తున్నాయని హరీష్రావు అన్నారు.


