కాకతీయ, వరంగల్ : వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్, ఎంజీఎం హాస్పిటల్ జనరల్ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నడాక్టర్ తంగెళ్ళ కల్యాణి (43) బుధవారం నుంచి కనిపించడం లేదని ఆమె భర్త ఈ ఎన్టీ విభాగం ప్రొఫెసర్, డాక్టర్ బండమీది విజయ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
డాక్టర్ కల్యాణి 23వ తేదీ సెప్టెంబర్ ఉదయం డ్యూటీ పూర్తిచేసుకుని, ఉదయం 10:42 గంటలకు ఎంజిఎం హాస్పిటల్ నుంచి ఒక ఆటోలో హన్మకొండ వైపు బయలుదేరినట్లు సీసీటీవీ ఫుటేజీలో గమనించారు. అనంతరం ఉదయం 11:08 గంటలకు కాజీపేట్ రైల్వే ప్లాట్‌ఫారమ్ లో చివరిసారిగా కనిపించారు. ఆ తర్వాత నుంచి తొమ్మిది రోజులుగా ఆమె ఎక్కడ ఉన్నారో సమాచారం లేదని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కనిపించకుండా పోయిన రోజు ఆమె తెల్ల చుడిదార్, గులాబీ రంగు ప్యాంట్, గులాబీ రంగు చున్నీ, గులాబీ రంగు సాండల్స్, ఆకుపచ్చ రంగు హ్యాండ్ బ్యాగ్ ధరించి ఉన్నట్లు, ఆమె ఎత్తు 5.3 అడుగులు ఉంటుందని పేర్కొన్నారు. ఆమె తన మొబైల్ ను కూడా తనతో తీసుకెళ్లలేదని కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి సహాయం చేయాలని వారు కోరారు. ఎవరైనా సమాచారం తెలిసినవారు పోలీసు విభాగానికి, కుటుంబ సభ్యులకు 9908843080, 8712685090, 08712685117 నంబర్ల ద్వారా సమాచారం అందించాలని వేడుకుంటున్నారు.


