- ప్రజలందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి కలగాలి
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పదో రోజు బుధవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ మహాశక్తి దేవాలయంలో భక్తిశ్రద్ధల మధ్య రుద్ర సహిత చండియాగం ఘనంగా నిర్వహించారు. యాగంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం, జిల్లా ప్రజలందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి కలగాలని ఆయన ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయదశమి సమయం అందరికీ విజయాలను చేకూర్చాలని, దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ చండీయాగంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పాల్గొన్నారు. ఆలయ వేదికను ప్రత్యేకంగా అలంకరించగా అమ్మవారు మహిషాసురమర్ధిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల రాకతో దేవాలయ ప్రాంగణం కిక్కిరిసింది.


