- నర్సరీల్లో మొక్కలను సంరక్షించాలి
- కలెక్టర్ పమేలా సత్పతి
కాకతీయ, కరీంనగర్ : జిల్లాలో పర్యావరణ సంరక్షణతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ మునిసిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్తో కలిసి ఎల్ఎండీ సమీపంలోని నర్సరీని సందర్శించారు. నర్సరీలోని మొక్కలు ఎండిపోకుండా నీరు సమయానికి అందించాలని, పిచ్చిమొక్కలు, గడ్డి తొలగించి నర్సరీని శుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. రోడ్డు డివైడర్లలో మొక్కలు నాటాలని, ఉమెన్స్ కాలేజీతో పాటు పలు ప్రాంతాల్లో పండ్ల మొక్కలను నాటి సంరక్షించాలని, పెరిగిన మొక్కలను వృథా చేయకుండా తప్పనిసరిగా నాటాలని సూచించారు.
హౌసింగ్ బోర్డ్ కాలనీలో మున్సిపల్ వాహనాల నిల్వ కోసం కోటి రూపాయల వ్యయంతో రేకుల షెడ్డు నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. మెడికవర్ ఆసుపత్రి సమీపంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.2 కోట్లతో నిర్మిస్తున్న బాలసదన్ భవన పనులను పరిశీలించారు. విజయదశమి పర్వదినం సందర్భంగా సప్తగిరి కాలనీలోని మున్సిపల్ రేకుల షెడ్డులో మున్సిపల్ వాహనాలకు నిర్వహించిన పూజలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కమిషనర్ ప్రపుల్ దేశాయ్, డిప్యూటీ కమిషనర్ వేణుమాధవ్, మున్సిపల్ ఈఈ సంజయ్ కుమార్, ఏఈ సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.


