కాకతీయ, పెద్దపల్లి : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిమిత్తం ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం పరిశీలించారు. పెద్దపల్లి మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాల, రామగిరి జేఎన్టీయూ, మంథని ఇంజనీరింగ్ కళాశాల, గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లను కలెక్టర్ కోయ శ్రీ హర్ష అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీ, డీసీపీ కరుణాకర్ తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలోని ఆరు మండలాల బ్యాలెట్ బాక్సులు మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాలలో, మంథని నియోజకవర్గంలోని నాలుగు మండలాల బాక్సులు, రామగిరి జేఎన్టీయూలో పాలకుర్తి, అంతర్గం, ధర్మారం మండలాలకు చెందిన బ్యాలెట్ బాక్సులు గోదావరిఖని కళాశాలలో భద్రపరిచేలా ఏర్పాట్లు చేశామన్నారు. స్ట్రాంగ్ రూం భద్రత, కౌంటింగ్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించినట్లు తెలిపారు. మంథని, గోదావరిఖని నియోజకవర్గాలకు చెందిన ఏడు మండలాల్లో పోలింగ్ అక్టోబర్ 23న, పెద్దపల్లి నియోజకవర్గంలోని 6 మండలాల్లో అక్టోబర్ 27న పోలింగ్ జరగనుందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో నరేందర్, ఆర్డీవోలు గంగయ్య, సురేష్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


