కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్: ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ చేతిలో ఘోర పరాజయం పాలైన తర్వాత పాకిస్థాన్ క్రికెట్‌లో కలకలం రేగింది. ఈ ఓటమి ప్రభావం నేరుగా ఆటగాళ్లపై పడింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కీలక నిర్ణయం తీసుకుని, తమ ఆటగాళ్లకు జారీ చేసిన విదేశీ లీగ్‌లకు సంబంధించిన No Objection Certificates (NOCs) అన్నిటినీ రద్దు చేసింది. దీంతో ఇకపై పాక్ క్రికెటర్లు వివిధ దేశాల్లో జరిగే లీగ్‌లలో ఆడే అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నిర్ణయం వల్ల బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది, మొహమ్మద్ రిజ్వాన్ వంటి స్టార్ క్రికెటర్లు కూడా బిగ్‌బ్యాష్, సీపీఎల్ లేదా ఇతర టీ20 లీగ్‌లలో పాల్గొనలేరు.
PCB ఈ నిర్ణయం వెనుక కారణం ఆటగాళ్ల ప్రదర్శన పట్ల ఉన్న అసంతృప్తి అని తెలుస్తోంది. ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్, ఫిట్‌నెస్, పనితీరును పరిశీలించిన తర్వాతే భవిష్యత్తులో వారికి మళ్లీ అనుమతులు ఇవ్వాలా లేదా అనేది నిర్ణయిస్తామని బోర్డు స్పష్టం చేసింది. ఆసియా కప్‌లో చిత్తు చిత్తుగా ఓడిపోయిన తర్వాత దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బోర్డు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఈ చర్య పాక్ క్రికెటర్ల కెరీర్‌పై ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి.


