
- పోలీస్ శాఖలో 17,000 ఖాళీల భర్తీకి చర్యలు
- మావోయిస్టులతో చర్చలు అనవసరం
- మాదంతా ఖాకీ బుక్.. పింక్ బుక్ గురించి తెలియదు
- బాధ్యతలు స్వీకరించిన డీజీపీ శివధర్ రెడ్డి
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తన మొదటి ఛాలెంజ్ లోకల్ బాడీ ఎన్నికలని, శాంతియుతంగా ప్రక్రియ పూర్తి చేయడానికి సన్నద్ధం అవుతున్నామని డీజీపీగా శివధర్ రెడ్డి స్పష్టంచేశారు. నూతన డీజీపీగా శివధర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావును మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీజీపీగా నియమించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఏ లక్ష్యంతో తనను నియమించారో అందుకు అనుగుణంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. పోలీస్ శాఖలో 17,000 ఖాళీలు ఉన్నాయని.. ఆ నియామకాలు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. బేసిక్ పోలీసింగ్‌తో సాంకేతికతను ఉపయోగించుకుని మరింత సమర్థవంతంగా పని చేస్తామని డీజీపీ తెలిపారు.
బయటకు రావడానికి, ఆయుధాలు వదిలిపెట్టడానికి నిర్ణయం తీసుకున్నామంటూ మావోయిస్టు పొలిట్ బ్యూరో మల్లోజుల వేణు గోపాల్ ఇటీవల ఒక ప్రకటన విడుదల చేశారన్నారు. జనరల్ సెక్రటరీ బసవరాజు ఉన్నపుడే ఆ నిర్ణయం జరిగిందని వేణుగోపాల్ ప్రకటనలో పేర్కొన్నారని చెప్పారు. వేణుగోపాల్ ఇచిన స్టేట్‌మెంట్‌ను జగన్ ఖండించారని.. ప్రజా పోరాట పంథా సక్సెస్ అవల్లేదని మావోయిస్టులే అంటున్నారని డీజీపీ వెల్లడించారు. పోలీసులు వేధిస్తారని భయంలేకుండా ఎలాంటి సంశయం లేకుండా మావోయిస్టుల జన జీవన స్రవంతిలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులతో తమకు ఇక్కడ సమస్య లేనప్పుడు వాళ్ళతో చర్చలు అనవసరమని చెప్పారు.‘మాకు ఉన్నదంతా ఖాకీ బుక్.. మాకు పింక్ బుక్ గురించి తెలియదు. ఇతరుల వ్యక్తిత్వ హనానికి పాల్పడేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటాం’ అంటూ నూతన డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు.


