కాకతీయ, నేషనల్ డెస్క్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రంలోని మోదీ సర్కార్ తీపి కబురు అందించింది. కరవు భత్యం (Dearness Allowance – DA) 3 శాతం పెంపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజా పెంపుతో డియర్‌నెస్ అలవెన్స్ 55 శాతం నుంచి 58 శాతానికి చేరింది. పెరిగిన డీఏ ఈ ఏడాది జులై నుంచి అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం వల్ల దాదాపు ఒక కోటి మందికిపైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.సాధారణంగా కేంద్రం ఏటా రెండుసార్లు – జనవరి, జూలైలో డీఏ పెంపును అమలు చేస్తుంది. అయితే ప్రకటన మాత్రం సాధారణంగా మార్చి, అక్టోబర్‌లో చేస్తుంది. ఆలస్యంగా ప్రకటించినా, బకాయిలతో సహా జనవరి, జూలై నుంచి వర్తింపజేస్తారు.
డీఏ సవరణకు ఆల్ ఇండియా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ (AICPIN-IW) ను ప్రాతిపదికగా తీసుకుంటారు. ఇది ద్రవ్యోల్బణ స్థాయిని సూచిస్తుంది. ఈ ఏడాది మార్చిలో కూడా ప్రభుత్వం డీఏను 2 శాతం పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మూడుశాతం పెంపును ఆమోదించి అమలు చేయనుంది. కేంద్రం డీఏ పెంపు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగులకు అదే రీతిలో డీఏ పెంచే అవకాశం ఉంది.


