కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర పర్యాటక శాఖలో కోటి రూపాయల నిధుల దుర్వినియోగం బయటపడింది. ఔట్‌సోర్సింగ్ జూనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న శ్రుతి అనే ఉద్యోగిని, దాదాపు రూ.1.05 కోట్ల ప్రభుత్వ సొమ్మును తన ప్రియుడి బ్యాంకు ఖాతాలోకి మళ్లించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై టూరిజం ఎండీ వల్లూరు క్రాంతి ఆదేశాల మేరకు కఠిన చర్యలు ప్రారంభమయ్యాయి.
నాలుగేళ్ల క్రితం కన్సల్టెంట్‌గా టూరిజం శాఖలో చేరిన శ్రుతి, అనంతరం ఔట్‌సోర్సింగ్ మోడల్‌లో జూనియర్ అకౌంటెంట్ బాధ్యతలు చేపట్టింది. సిబ్బంది, కార్మికుల వేతనాలను ఆర్టీజీఎస్ ద్వారా పంపిణీ చేసే పని ఆమె పరిధిలో ఉండేది. ఈ ప్రక్రియలో వెండర్ పేరుతో అదనపు మొత్తాలను జతచేసి, తన ప్రియుడి ఖాతాకు దారి మళ్లించడం మొదలు పెట్టింది.
ఇలా 27 నెలల కాలంలో క్రమం తప్పకుండా నిధులు పక్కదారి పట్టించి రూ.1.05 కోట్లు అక్రమంగా స్వాహా చేసింది. అందులో సుమారు రూ.80 లక్షలు ఒకే బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా శ్రుతి పేరుతో నలుగురు వేర్వేరు బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు కూడా బయటపడింది.
కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎండీ లెక్కలు పరిశీలించినప్పుడు ఈ మోసం వెలుగులోకి వచ్చింది. నిధుల దారిమళ్లింపులో అకౌంట్స్ ఏజీఎంల నిర్లక్ష్యం కూడా కారణమని తేలడంతో, ఇద్దరినీ సస్పెండ్ చేశారు. శ్రుతిపై కేసు నమోదు చేసి ఉద్యోగం నుంచి తొలగించారు. ఆమె తల్లిదండ్రులను కూడా విచారణకు పిలిపించినట్లు సమాచారం.
ఈ ఘటనతో పాటు పర్యాటక శాఖలో విభాగాల కేటాయింపు, సిబ్బంది పనుల పర్యవేక్షణలో స్పష్టత లేకపోవడం కూడా బయటపడింది. మూడేళ్లకోసారి ఉద్యోగులను విభాగాల వారీగా మారుస్తూ ఉండాలని నిబంధన ఉన్నా, అది పాటించకపోవడం వల్ల ఇలాంటి అవకతవకలకు అవకాశం కలిగిందని అధికారులు సూచిస్తున్నారు. అంతేకాకుండా, గతంలో పర్యాటక శాఖ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం విషయంలోనూ అనేక అనుమానాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.


