కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ, ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది.
ప్రస్తుతం బంగాళాఖాతంలో కేంద్రీక్రుతమైన అల్పపీడనం వేగంగా బలపడుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రేపు తెల్లవారుజాము నాటికి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత కూడా ఇదే దిశలో ప్రయాణించి 3వ తేదీన దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఈ వాయుగుండం ప్రభావంతో గురువారం, శుక్రవారాల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు రానున్న మూడు రోజుల పాటు తీరం వెంబడి గంటకు 30 కిలోమీటర్లకు పైగా వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని..మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు విజ్నప్తి చేశారు.


