వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం
కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కృషితో వరంగల్‌కు సీజీహెచ్ ఎస్ మంజూరైంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఇకపై స్థానికంగానే మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ డిమాండ్‌ను నెరవేర్చడంలో ఎంపీ కీలక పాత్ర పోషించారు. కేంద్ర మంత్రులను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేయడంతోపాటు, ఇతర రాష్ట్రాల ఎంపీలతో సమన్వయం చేసి వినతిపత్రాలను సేకరించి కేంద్రానికి సమర్పించడం ద్వారా ఈ ఫలితాన్ని సాధించామన్నారు.
ఇప్పటివరకు వరంగల్ ప్రాంతానికి చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది హైదరాబాద్‌లోని సీజీహెచ్ ఎస్ సెంటర్లకు మాత్రమే వెళ్లాల్సి రావడంతో వృద్ధ పెన్షనర్లు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరంగల్ లోనే వెల్‌నెస్ సెంటర్ ప్రారంభం కావడం వల్ల వేలాది కుటుంబాలకు ఉన్నత వైద్యసేవలు, సులభమైన మెడికల్ రీయింబర్స్‌మెంట్ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. వెల్‌నెస్ సెంటర్ కోసం అనువైన భవనాన్ని వెంటనే గుర్తించాలని కలెక్టర్, జి డబ్ల్యూ ఎం సి కమిషనర్‌లను కోరినట్లు ఎంపీ తెలిపారు. వరంగల్ అభివృద్ధి కోసం మరిన్ని కేంద్ర సంస్థలు, సదుపాయాలను తీసుకు రావడంపై కూడా తాను కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ఎంపీ డా. కడియం కావ్యకు కృతజ్ఞతలు తెలిపారు.


