- అక్టోబర్ 2న దసరా.. అదే రోజున గాంధీ జయంతి
- మద్యం, మాంసం దుకాణాలు మూసేయాలని సర్కార్ ఆదేశాలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : మద్యం, మాంసం ప్రియులకు షాకింగ్ న్యూస్ చెప్పారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్. అక్టోబర్ 2వ తేదీన మాంసం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మాంసం దుకాణాలు, స్లాటర్ హౌస్‌లను జీహెచ్ఎంసీ పరిధిలో మూసివేయాలని కమిషనర్ కర్ణన్ ఆదేశించారు. సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులు పర్యవేక్షణ చేపట్టి సరైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈసారి గాంధీ జయంతి రోజునే దసరా రావడంతో అయోమయంలో పడ్డారు మాంసం విక్రయదారులు.
మద్యం షాపులు బంద్..
మరోవైపు.. అక్టోబర్ 2వ తేదీ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా కూడా మాంసం షాపులతో పాటు మద్యం షాపులను కూడా మూసివేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది మహాత్మా గాంధీ జయంతికి రాష్ట్రవ్యాప్తంగా ఈ రూల్‌ను పాటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది మహాత్మాగాంధీ జయంతి, దసరా పండుగలు ఓకే రోజు వచ్చాయి. ఈ క్రమంలో మద్యం షాపులను ప్రభుత్వం మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో దసరాను ఘనంగా చేసుకుంటారు. అయితే, ప్రభుత్వ నిర్ణయంపై ఏం చేయాలా అనే ఆలోచనలో మద్యం, మాంసం ప్రియులు ఉన్నారు.


