- రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా
- వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు పూర్తిగా నియంత్రణలో ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా అన్నారు. అయినప్పకీ వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. హైదరాబాద్‌లోని రాజీవ్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో సీజనల్ వ్యాధుల నివారణపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణ పై ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రదర్శనను మంత్రి పరిశీలించారు.
సీజనల్ వ్యాధులు పూర్తి నియంత్రణలో ఉన్నాయని మంత్రికి ఆరోగ్య శాఖ అధికారులు వివరించారు. గత సంవత్సరం తో పోలిస్తే సీజనల్ వ్యాధుల కేసులు తగ్గుముఖం పట్టాయని వివరించారు. రాష్ట్రంలో ప్రజారోగ్య శాఖ సీజనల్ వ్యాధుల నిర్ములనలో ముందస్తు నివారణ చర్యలు చేపట్టడం వల్ల కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని మంత్రికి వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజల్లో అవగాహన కల్పించామన్నారు. ఈసందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ.. సీజనల్ కేసులు నమోదు రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని సమీక్షలో ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహా ఆదేశించారు.


