- మా పార్టీ నాయకులను టార్గెట్ చేయొద్దు
- సీఎం స్టాలిన్‌పై టీవీకే అధినేత విజయ్ హాట్ కామెంట్స్
- తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసిందంటూ వీడియో సందేశం
కాకతీయ, నేషనల్ డెస్క్ : తమిళనాడు ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోవాలంటే తనను ఏమైనా చేసుకోవచ్చని.. తమ పార్టీ నేతలను మాత్రం సీఎం స్టాలిన్ టార్గెట్ చేయొద్దని టీవీకే అధినేత, నటుడు విజయ్ అన్నారు. కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో తమ తప్పిదమేమీ లేకపోయినా డీఎంకే సర్కార్ తమపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందన్నారు. కరూర్ తొక్కిసలాట ఘటన జరిగిన రెండురోజుల తర్వాత టీవీకే అధినేత, నటుడు విజయ్ తొలిసారి స్పందించారు.
ఈమేరకు మంగళవారం ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో ముఖ్యమంత్రి స్టాలిన్, డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనతో తన హృదయం పూర్తిగా బాధతో నిండిపోయిందని విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోలేదని, తన మనసు పూర్తిగా బాధతో నిండిపోయినట్లు చెప్పారు. కరూర్ జిల్లాకు చెందిన టీవీకే నేతలపై పోలీసులు కేసులు పెట్టిన నేపథ్యంలో విజయ్ ఈ వ్యాఖ్యలు చేయడం తమిళ రాజకీయాల్లో కలకలంరేపుతున్నాయి.


