- తెలుగుతల్లి ఫ్లైఓవర్ పేరు మార్చిన రాష్ట్ర ప్రభుత్వం
- కొత్త పేరుతో బోర్డు ఏర్పాటు చేసిన అధికారులు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌లోని కీలకమైన ఫ్లైఓవర్లలో ఒకటైన ‘తెలుగు తల్లి’ ఫ్లైఓవర్ పేరు మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్లైఓవర్ పేరును ‘తెలంగాణ తల్లి’ ఫ్లైఓవర్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు కొత్త పేరుతో కూడిన బోర్డును సైతం ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేయడంతో ఈ మార్పు అధికారికంగా అమల్లోకి వచ్చింది. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయం సమీపంలో ఈ ఫ్లైఓవర్ ఉంది.
2005లో ప్రారంభం..
ఇప్పటివరకు ‘తెలుగు తల్లి’ ఫ్లైఓవర్‌గా అందరికీ సుపరిచితమైన ఈ ఫ్లైఓవర్… ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇకపై ‘తెలంగాణ తల్లి’ ఫ్లైఓవర్‌గా గుర్తింపు పొందనుంది. నగరంలోని ప్రధాన కూడళ్లను కలిపే ఈ మార్గంలో అధికారులు కొత్త పేరును సూచిస్తూ బోర్డును ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని గుర్తింపును ప్రతిబింబించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2005లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించి ‘తెలుగుతల్లి ఫ్లైఓవర్’గా నామకరణం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ పేరు మార్చాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది.


