- పీస్ కమిటీ సమావేశంలో మామునూరు ఏసీపీ వెంకటేష్
కాకతీయ, గీసుగొండ : రానున్న దసరా పండుగను, గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని మామునూరు ఏసీపీ వెంకటేష్ అన్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీ పెద్దలతో మంగళవారం నిర్వహించిన పీస్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో, పండుగ వేళల్లో ప్రజల మధ్య సఖ్యతా భావం నెలకొనాలని, ఎటువంటి విఘాతం కలగకుండా అందరూ సహకరించాలని ఏసీపీ పిలుపునిచ్చారు. ప్రజల భద్రత మా మొదటి కర్తవ్యమని, ఎవరూ చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడరాదని హెచ్చరించారు.
గ్రామ పెద్దలు ప్రజలకు అవగాహన కల్పించి, పోలీసు శాఖకు సహకరించాలని సూచించారు. దసరా పండుగ సందర్భంగా ఎక్కువ మంది ప్రజలు ఒకేచోట చేరుతారని, అలాంటి వేళల్లో ప్రత్యేక జాగ్రత్తలు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కూడా ప్రతిపక్షాలు, అభ్యర్థులు చట్టపరమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అదేవిధంగా బదిలీపై వెళ్తున్న సీఐ మహేందర్ గీసుకొండ పోలీస్ స్టేషన్లో శాంతి భద్రతల కోసం చేసిన కృషి అభినందనీయమనీ మామునూరు ఏసీపీ వెంకటేష్ కొనియాడారు. ఈ సందర్భంగా సీఐ మహేందర్ ను పూలమాల శాలువాలతో సత్కరించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ ఎండి రియాజుద్దీన్, గీసుకొండ ఎస్ఐలు అనిల్, కుమార్, రోహిత్, విజయరాజు, సిబ్బంది పాల్గొన్నారు.


